ఫ్రెండ్ భార్యపై మోజు పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న స్నేహితుడిని  పథకం ప్రకారం చంపేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన దల్బీర్ కి ప్రియ( పేరుమార్చాం) అనే యువతితో వివాహమైంది. కాగా..అతనికి గుల్కేష్ అనే మిత్రుడు ఉన్నాడు. అయితే.. గుల్కేష్ కన్ను... స్నేహితుడు దల్బీర్ భార్య ప్రియపై పడింది. చాటుమాటుగా ఆమెను వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకొని తన సొంతం చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న స్నేహితుడు దల్బీర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు.

ఈ క్రమంలో పథకం ప్రకారం.. జూన్ 24వ తేదీ రాత్రి గుల్కేష్.. దల్బీర్ ని ఓ చోటుకు రావాల్సిందిగా కోరాడు. అక్కడికి వెళ్లిన దల్బీర్ ని ఇటుక తో కొట్టి స్పృహ లేకుండా చేశాడు. అనంతరం దుల్బీర్ ని రైలు పట్టాలపై పడేశాడు. రైలు అతని మీద నుంచి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గుల్కేష్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని సమాచారం అందించాడు.

మొదట ఆత్మహత్య గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత హత్యగా అనుమానించారు. ఆ క్రమంలో విచారించగా.. గుల్కేష్ అసలు నేరస్థుడిగా తేలింది. ప్రియకి కూడా భర్త అంటే ఇష్టం లేదని... గుల్కేష్ ని పెళ్లి చేసుకోవాలని భావించిందని దర్యాప్తులో తేలింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు కోనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.