ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఓ మహిళకు రూ. 70 వేలు ఇచ్చి మరో మహిళను కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఆమె ప్రవర్తన నచ్చలేదని చంపేశాడు. 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం వెలుగు చూసింది. 70 వేలు ఓ మహిళకు ఇచ్చిన ఆమెను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఆమె ప్రవర్తన నచ్చక చంపేశాడు. ఇద్దరి సహాయం తీసుకుని ఆమె గొంతు నులిమి చంపేసి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ అడవుల్లో డెడ్ బాడీని పడేశాడు. కొందరు ఆ డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దరమ్‌వీర్ మరో ఇద్దరు అరుణ్, సత్యవాన్‌ల సహాయం తీసుకుని తన భార్యను చంపేశాడు. ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. డెడ్ బాడీ లభించిన తర్వాత పోలీసులు దర్యాప్తు చేయగా శనివారం రాత్రి 1.40 గంటలకు ఓ ఆటో అనుమానాస్పదంగా కదులుతూ కనిపించింది. ఆ రూట్‌ను ట్రాక్ చేశారు. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ వెరిఫై చేసి దాని డ్రైవర్ అరుణ్‌ను పట్టుకున్నారు.

అరుణ్‌ను ప్రశ్నించగా.. మృతురాలు పేరు స్వీటి అని, ఆమె ధరమ్ వీర్ భార్య అని నిజం కక్కాడు. తాను, తన బావమర్దులు ఇద్దరు ధరమ్ వీర్, సత్యవాన్‌లు కలిసి ఆమెను చంపేసినట్టు వివరించాడు. హర్యానా సరిహద్దుల్లో గొంతు నులిమి చంపేసి అడవీలో పడేసినట్టు చెప్పాడని పోలీసులు వివరించారు.

Also Read: లోక్ సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్.. స్పీకర్‌కు మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు.. కాంగ్రెస్ ఏమన్నదంటే?

తన భార్య ప్రవర్తనపై ధరమ్ వీర్ సింగ్‌కు అసంతృప్తి ఎక్కువ. ఆమె తరుచూ ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా పారిపోయేది. ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని నెలలపాటు వెళ్లిపోయేదని అరుణ్ చెప్పాడు. స్వీటి తల్లిదండ్రులు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ఎవరికీ తెలియదని వివరించాడు. ఎందుకంటే ధరమ్ వీర్ సింగ్ ఆమెను ఓ మహిళ దగ్గర రూ. 70 వేలకు కొన్నాడని చెప్పినట్టు డీసీపీ చందన్ చౌదరి వివరించారు. స్వీటి కూడా తన కుటుంబం గురించి చెప్పేది కాదని, కానీ, తాను పాట్నాకు చెందినదానని చెప్పేదని అరుణ్ తెలిపాడు.

రైల్వే స్టేషన్ వద్ద దింపుతానని చెప్పి స్వీటిని బయటకు తీసుకెళ్లి చంపేశాడు. అయితే, ఆమె ఎందుకు? ఎక్కడికి వెళ్లేదనే విషయాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.