దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యూడిల్లీలో మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు వారి తరగతి గదిలోనే లైంగిక వేధింపులకు గురయ్యారు. 

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యూడిల్లీలో మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు వారి తరగతి గదిలోనే లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ధ్రువీకరించారు. ఓ స్కూల్‌లో ఇద్దరు ఎనిమిదేళ్ల బాలికలను గుర్తు తెలియని వ్యక్తి తరగతి గదిలోకి చొరబడి వేధించారని చెప్పారు. దుండగులు తరగతిలోకి వెళ్లి బాలికల దుస్తులను తొలగించారని తెలిపారు. 

‘‘భజన్‌పురా ప్రాంతంలోని ఒక మున్సిపల్ పాఠశాలలో.. వారి తరగతిలో కూర్చున్న ఇద్దరు బాలికలను గుర్తు తెలియని వ్యక్తి వేధించాడు. అతను వారి తరగతికి వెళ్లి బాలికల బట్టలు తొలగించాడు. తర్వాత గుర్తు తెలియని వ్యక్తి అతని బట్టలు తొలగించి తరగతి ముందు మూత్ర విసర్జన చేశాడు’’ అని స్వాతి మలివాల్ తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను తమ ముందు హాజరుకావాలని సమన్లు జారీచేసింది. ఒక అజ్ఞాత వ్యక్తి పాఠశాలలోకి ఎలా ప్రవేశిస్తాడనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈస్ట్ MCD కమిషనర్‌ను పిలవడం జరిగిందని స్వాతి మలివాల్ చెప్పారు. పాఠశాలలో అమర్చిన సీసీటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటన బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నించిందని.. ఈ విషయాన్ని మర్చిపోవాలని బాలికలను కోరిందని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ ఆరోపించారు.

Scroll to load tweet…

‘‘ఈ సంఘటన గురించి బాలికలు.. ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్‌కు వివరించారు. అయితే ఉపాధ్యాయులు దానిని దాచడానికి ప్రయత్నించారు. జరిగిన దానిని మరచిపోవాలని అమ్మాయిలను కోరారు’’ అని ఆమె అన్నారు. జరిగిన నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినందుకు, ఢిల్లీ పోలీసులకు రిపోర్ట్ చేయనందుకు పోక్సో చట్టం ప్రకారం స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిసింది. 

అయితే ఈ ఘటన జరిగిన స్కూల్‌లో ఎంట్రన్స్‌ వద్ద గానీ, లోపల గానీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నిందితుడి వివరాలు తెలుసుకోవడానికి స్కూల్‌కు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టామని.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు.