ఫోన్ రిపేర్ వచ్చిందని.. సర్వీసింగ్ సెంటర్ లో ఇస్తే.. ఫోన్ బాగు చేసి.. అందులో ఉన్న పేటీఎం యాప్ నుంచి దాదాపు రూ.లక్ష కాజేశారు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని కల్కజీ ప్రాంతానికి చెందిన యూసఫ్‌ కరీమ్‌ ఇటీవల తన ఫోన్‌ను సర్వీసింగ్ సెంటర్‌లో రిపేర్‌కు ఇచ్చారు. అక్కడి సిబ్బంది ఫోన్‌ రిపేర్‌ చేసి తిరిగిచ్చారు. ఆ తర్వాత ఇంటికెళ్లాక చూసుకుంటే ఆయనకు పేటీఎం నుంచి మెయిల్ వచ్చింది.

వేరే వ్యక్తులు తన పేటీఎం అకౌంట్లోకి లాగిన్‌ అయ్యారని, కొన్ని ట్రాన్జాక్షన్స్ కూడా చేశారని ఆ మెయిల్‌లో ఉంది.  తన పేటీఎం అకౌంట్‌ నుంచి రూ. 91వేలు వేరే ఎకౌంట్ కి ట్రాన్స్ఫర్  అయినట్లు కరీమ్‌ గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

ఫోన్‌ రిపేర్‌కు ఇచ్చిన సమయంలోనే ఈ నగదు బదిలీ అయ్యిందని, సర్వీసింగ్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులే తన పేటీఎం ఖాతాలోని ఈమెయిల్‌ ఐడీని మార్చి డబ్బు కాజేశారని కరీమ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక.. తన ఖాతాను బ్లాక్ చేయాలని పేటీఎంను ఎన్నిసార్లు కోరినా స్పందించలేదని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.