న్యూఢిల్లీ: పిస్టల్ ను తన స్నేహితురాలికి చూపిస్తూ పాతికేళ్ల యువకుడు ప్రమాదవశాత్తు తనను తానే కాల్చుకున్నాడు. స్నేహితురాలికి చూపించే ప్రయత్నంలో అతను తన కాలిపై కాల్చుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలోని తిలక్ నగర్ లో గల ఓ పార్కులో చోటు చేసుకుంది. 

సంఘటన జరిగిన తర్వాత శుక్రవారం రాత్రి 11.45 గంటల సమయంలో కాక్రోలాకు చెందిన సోను శర్మ, తన స్నేహితురాలు మేఘతో కలిసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి వెళ్లాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై కాల్పులు జరిపారని అక్కడ అబద్ధం చెప్పాడు.

సంఘటన జరిగినప్పుడు సోను శర్మ తాగి ఉన్నాడని, తనకు నాటు తుపాకిని చూపిస్తూ ప్రమాదవశాత్తు తన కాలిపై ఫైరింగ్ చేసుకున్నాడని విచారణలో మేఘ చెప్పింది. మేఘ వాంగ్మూలం ఆధారంగా శర్మను పోలీసులు అరెస్టు చేశారు. 

శర్మ మిత్రుడు మనోజ్ (26)ను పోలీసులు పట్టుకుని అతని నుంచి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. శర్మ, మనోజ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.