Asianet News TeluguAsianet News Telugu

Delhi COVID-19: అక్క‌డ‌ మాస్క్‌ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

Delhi COVID-19:దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ఢిల్లీలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. బ‌హిరంగ ప్రదేశాల్లో  మాస్క్‌లు తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే.. రూ. 500 జరిమానా విధించ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నిబంధ‌న‌లు తక్షణమే అమలులోకి వచ్చేలా  ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.    
 

Delhi Makes Masks Must In Public Places, Those In Private Cars Exempt
Author
Hyderabad, First Published Apr 23, 2022, 1:26 AM IST

Delhi COVID-19: గ‌త రెండున్నర యేండ్ల హడలెత్తించిన కరోనా మహమ్మారి కాస్త‌ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మానవాళంతా రిలాక్స్ అయ్యారు. ఇక కరోనా ఖేల్‌ఖతమని.. ప్రజలంతా కరోనా భ‌యాన్ని వీడి త‌మ‌ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కానీ.. గ‌త కొద్ది రోజులుగా.. దేశంలో మ‌రోసారి కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. ఈ పెరుగుదలను గమనిస్తే.. ఫోర్త్ వేవ్ వ‌చ్చిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

మ‌రి ముఖ్యంగా.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విప‌రీతంగా పెరుగుతోంది. ఈ  త‌రుణంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. తక్షణమే అమలులోకి వచ్చేలా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.    

అయితే ప్రైవేటు కార్లలో ప్రయాణిస్తున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం ఇటీవల మాస్క్ నిబంధనను ఎత్తివేసింది. అయితే కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో మళ్లీ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది. పొరుగున ఉన్న నోయిడాలో వందమందికి మాస్క్ పెట్టుకోనందుకు జరిమానాలు విధించారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) బుధవారం తన సమావేశంలో కోవిడ్ -19 సంక్రమణ యొక్క సానుకూల రేటు గత పక్షం రోజులుగా నగరంలో పెరుగుతోందని,  అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్/కవర్ ధరించనందుకు జరిమానా విధించాలని నిర్ణయించింది.  దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గురువారం, ఢిల్లీలో 4.71 శాతం పాజిటివ్ రేటుతో 965 తాజా కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇన్‌ఫెక్షన్ కారణంగా ఒకరు మరణించారు. ఇది బుధవారం 1,009, మంగళవారం 632 మరియు సోమవారం 501.  

తమిళనాడులోనూ..ఓ వైపు బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడంలో జనం నిర్లక్షంగా వ్యవహరించడం, మరో వైపు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం కూడా శుక్రవారం మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ , ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటించే విషయంలో జనం నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారినుంచి జరిమానాను కచ్చితంగా వసూలు చేయాలని ఆరోగ్య శాఖ, పోలీసుతో పాటు సంబంధిత అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు ఆయన విలేఖరులకు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios