కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి ఫేస్ మాస్క్ నిబంధనను తీసుకొచ్చింది. మాస్క్ నిబంధనను ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధించాలని DDMA నిర్ణయం తీసుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభిస్తుంది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో మళ్లీ మాస్క్ నిబంధనను తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. మాస్క్ నిబంధనను ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధించనుంది. 

అయితే పాఠశాలలను మూసివేయకూడదని డీడీఎంఏ నిర్ణయించింది. స్కూల్స్‌లో భౌతిక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అయితే నిపుణులతో సంప్రదించి ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వారు చెప్పారు. ఇక, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.

ఇక, మంగళవారం ఢిల్లీలో కొత్తగా 632 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని అధికారులు చెప్పారు. ఇక, ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య ఢిల్లీలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. పరిస్థితి ఆందోళనకరంగా లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం అన్నారు. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య తక్కువగా ఉందని.. ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు కూడా 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరంలకు లేఖ రాశారు. COVID-19 వ్యాప్తిని నియంత్రించడానికి ఆందోళన కలిగించే ప్రాంతాలలో, అవసరమైతే, కఠినంగా పర్యవేక్షించాలని, ముందస్తు చర్య తీసుకోవాలని లేఖలో ఆ రాష్ట్రాలకు సూచించారు. 

కొత్త కేసుల సమూహాలను పర్యవేక్షించడం, వ్యాధి క్రమణ వ్యాప్తిని అరికట్టడానికి నియంత్రణ ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాల‌ని సూచించారు. అలాగే.. క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి భారీ మొత్తంలో పరీక్షలు నిర్వ‌హించాల‌ని చెప్పారు.