ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌(‌సీబీఐ) దూకుడు పెంచింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌(‌సీబీఐ) దూకుడు పెంచింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే తనకు సీబీఐ నోటీసులు పంపిందనే వార్తలను మనీష్ సిసోడియా ధ్రువీకరించారు. అదే సమయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘సీబీఐ రేపు నన్ను మళ్లీ పిలిచింది. వారు నాపై సీబీఐ, ఈడీ పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. నా ఇంటిపై దాడి చేశారు, బ్యాంక్ లాకర్‌లో సోదాలు చేశారు.. కానీ నాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. ఢిల్లీ పిల్లలకు మంచి చదువు కోసం నేను ఏర్పాట్లు చేశారు. నన్ను ఆపాలని చూస్తున్నారు. విచారణకు నేను ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నాను’’ అని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. 

ఈ కేసులో సీబీఐ మూడు నెలల క్రితమే చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే మనీష్ సిసోడియాను ఛార్జ్ షీట్‌లో నిందితుడిగా పేర్కొనలేదు. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వ్యాపారులు విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి సహా ఏడుగురు నిందితులుగా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే మనీష్‌ సిసోడియా నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బ్యాంకు లాకర్లను కూడా తెరిచిచూశారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.