ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాకు కష్టాలు వీడటం లేదు. మనీష్‌ సిసోడియాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాకు కష్టాలు వీడటం లేదు. మనీష్‌ సిసోడియాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే నేడు మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచిన సమయంలో సీబీఐ న్యాయవాది.. తాము తదుపరి రిమాండ్ కోరడం లేదని చెప్పారు. అయితే రాబోయే 15 రోజుల్లో తాము రిమాండ్ కోరవచ్చని తెలిపారు. ‘‘సోదాలు జరిగాయి.. వారెంట్ తీసుకున్నారు.. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.. అన్ని విషయాల గురించి కోర్టుకు తెలియజేస్తున్నారు. మరోవైపు సీబీఐ చట్టవిరుద్ధమైన చర్య చేస్తోందని చెబుతున్నారు’’ అని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే స్పందించిన కోర్టు ‘‘ఏదైనా చట్టవిరుద్ధమని వారు భావిస్తే.. వారు దానిని సవాలు చేయవచ్చు’’ అని పేర్కొంది. మార్చి 20 వరకు సిసోడియాకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీష్ సిసోడియాపై సీబీఐ అధికారులు కీలక అభియోగాలు మోపారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26న ఆయనను విచారించిన సీబీఐ అధికారులు.. అదే రోజు అరెస్ట్ చేశారు. తన అరెస్టు అనంతరం ఫిబ్రవరి 28న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి సిసోడియా రాజీనామా చేశారు. ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు.. తొలుత 5 రోజుల సీబీఐ రిమాండ్‌కు అనుమతించింది. ఆ తర్వాత దానిని మరో రెండు రోజులు రిమాండ్‌ను పొడిగించింది. ఈ విధంగా వారం రోజుల పాటు మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే తాజాగా సిసోడియా రిమాండ్ గడువు పూర్తికావడంతో.. సోమవారం సీబీఐ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 

ఇక, తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ మార్చి 10న చేపడతామని కోర్టు తెలిపింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై మార్చి 10న సీబీఐ సమాధానం ఇవ్వనుంది.