Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. షాపులపై ఆంక్షల్లేవ్.. త్వరలోనే స్కూల్స్ ఓపెనింగ్‌!

ఢిల్లీలో వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కట్టడి నిబంధనలు ఎత్తేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వీకెండ్ కర్ఫ్యూను ఎత్తేసింది. అయితే, నైట్ కర్ఫ్యూ ఎప్పటిలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీకెండ్ కర్ఫ్యూతోపాటు షాపుల ఓపెనింగ్‌కు సరి, బేసి నిబంధనలను ఎత్తేసింది. రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో నడవచ్చని అనుమతి ఇచ్చింది. ఈ రోజు కరోనా కేసులు 5000 లోపే నమోదు కావొచ్చని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
 

delhi lifts weekend curfew removed odd even policy for shops
Author
New Delhi, First Published Jan 27, 2022, 2:34 PM IST

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు(Coronavirus Cases) తగ్గుముఖం(Decline) పడుతున్నాయి. కేసులు ఎక్కువే నమోదు అవుతున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆంక్షల సడలింపులకే మొగ్గు చూపింది. అందుకే వారాంతపు కర్ఫ్యూను(Weekend Curfew) ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, షాపుల నిర్వహణకు విధించిన సరి, బేసి నిబంధనలనూ ఎత్తివేసినట్టు ప్రకటించింది. అయితే, రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుందని తెలిపింది. కాగా, పాఠశాలలను పున:ప్రారంభించడంపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు సంకేతాలను ఇచ్చింది.

పెళ్లిళ్లు, ఇతర వేడుకల నిర్వహణకూ ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయవద్దనే నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే పెళ్లి వేడుకలకు గరిష్టంగా 200 మంది హాజరు కావచ్చని తెలిపింది. లేదా పెళ్లి జరుగుతున్న హాల్ సామర్థ్యం 50 శాతానికి లోపే మంది హాజరు అవ్వాలని పేర్కొంది. కాగా, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లపైనా ఆంక్షలను కొంత సడలించింది. బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు వాటి సామర్థ్యంలో 50 శాతం మందిని ఆహ్వానించవచ్చునని పేర్కొంది. కాగా, ప్రభుత్వ కార్యాలయాలూ 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయని వివరించింది. కాగా, ఎక్కువ మంది పాఠశాలలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూశారు. పాఠశాలలను తెరవాలని ఈ సమావేశంలో నిర్ణయం జరగలేదు. అయితే, త్వరలో జరగనున్న డీడీఎంఏ సమావేశంలో స్కూల్స్ రీఓపెనింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ గురువారం కరోనా కేసులు తగ్గుతాయనే అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఐదు వేల లోపే కరోనా కేసులు నమోదు అవుతాయని వివరించారు. కాగా, పాజిటివిటీ రేటు కూడా ప్రస్తుతం ఉన్న 10 శాతానికంటే కూడా క్షీణిస్తుందని పేర్కొన్నారు. గతవారం రోజులుగా ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు అర్థం అవుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇక్కడ ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios