ప్రతియేటా అక్టోబర్ నెలాఖరు నుంచి డిసెంబర్, జనవరి వరకు దేశ రాజధాని న్యూఢిల్లీ అంతటా పొగమయమై.. ప్రజలు ప్రత్యేకించి వ్రుద్ధులు, పిల్లలు, మహిళలు రోగాల బారీన పడుతున్న పరిస్థితి.

దీనికి పొరుగున ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు వరిపొలాల కొయ్యకాళ్లు దగ్ధం చేయడం ఒక కారణమైతే.. వాహనాలు వదిలే పొగ మరొక కారణం. వాహనాల పొగకు, కొయ్యకాళ్ల పొగ తోడైతే కాలుష్యం తీవ్రత పెరిగిపోతూ ఉన్నది. రెండేళ్లపాటు ‘కారు పూలింగ్’ విధానం అమలు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. 

ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తన వంతు ప్రయత్నంగా విద్యుత్ ఆధారిత బస్సును హస్తిన రోడ్లపై తిప్పేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా 100 శాతం విద్యుద్ధీకరించిన లో ఫ్లోర్ బస్సు ట్రయల్ రన్ నిర్వహించింది. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది జూలై నాటికి ఈ-బస్సులను కొనుగోలు చేయనున్నది. 
 
మూడు నెలల పాటు సాగే ట్రయల్ రన్‌లో అంబేద్కర్ నగర్ - ఇంద్రపురి మధ్య ఈ ఈ- బస్సు ట్రిప్పులు వేస్తారు. ఈ మార్గం విభిన్న పరిస్థితుల మధ్య ఉంటుంది. కనుక ఈ రోడ్డుపై నిర్వహణ అవకాశాలు, తలెత్తే పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ మాట్లాడుతూ అత్యాధునిక విద్యుత్ ఆధారిత బస్సులు నడుపడానికి ఢిల్లీ రోడ్లు అణువుగా ఉన్నాయా? లేదా? అన్న విషయం అర్థం చేసుకోవడానికి ట్రయల్ రన్ ఉపకరిస్తుందన్నారు. ఈ- బస్సుల్లో వినియోగిస్తున్న బ్యాటరీలు ఎంతకాలం సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఎంతసేపు చార్జింగ్ కలిగి ఉంటాయన్న సంగతిని తెలుసుకోవచ్చునని తెలిపారు. 

​ఢిల్లీ నగర రోడ్లపై తిరిగే బస్సులను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రానిట్ సిస్టమ్ (డీఐఎంటీఎస్)ను ప్రాజెక్టు కన్సల్టెంట్‌గా నియమించింది. 33 సీట్లతోపాటు పూర్తి ఎయిర్ కండీషనింగ్ గల ఈ బస్సును చైనా సంస్థ ఫొటోన్ సహకారంతో పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూసన్స్ తయారు చేసింది. 

ఈ బస్సు బ్యాటరీ పూర్తిగా రీ చార్జి కావడానికి 30 నిమిషాలు పడుతుందని, తర్వాత 150 - 200 కి.మీ. వరకు బస్సు ప్రయాణిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ ఈ-బస్సులో సేఫ్టీకి ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తెలిపేందుకు ‘పానిక్ బటన్’ ఏర్పాటు చేశారు. 

ఢిల్లీ రవాణాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఢిల్లీలోని బస్సు డిపోల్లో ఇప్పటికే 1000 విద్యుత్ బస్సుల నిర్మాణం ప్రారంభమైందన్నారు. 2019 జూన్ నాటికి ఆయా బస్సుల నిర్మాణం పూర్తయి జూలైలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.