ఢిల్లీ పలు కీలక రంగాల్లో పుదుచ్చేరి కంటే వెనుకంజలో ఉందని బీజేపీ ఆరోపించింది. విద్యా, వైద్యంలో పుదుచ్చేరి ముందంజలో ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. 

న్యూఢిల్లీ : హెల్త్, ఎడ్యుకేష‌న్ విష‌యంలో కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి కంటే దేశ రాజధాని ఢిల్లీ వెనుక‌బ‌డి ఉందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప‌దే ప‌దే చెప్పే ‘ఢిల్లీ మోడల్’ పై ఆయ‌న శ‌నివారం ప్ర‌శ్న‌లు కురిపించారు. కీల‌క రంగాల్లో పుదుచ్చేరితో ఢిల్లీ వెనుకంజ‌లోనే ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు. 

అమిత్ మాల్వియా మూడు నిమిషాల వీడియోను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అందులో అరవింద్ కేజ్రీవాల్ పై, ఆమ్ ఆద్మీ పార్టీపై విమ‌ర్శ‌లు చేశారు. ఆ వీడియ‌లో ‘‘ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌ర‌చుగా ఢిల్లీ గురించి, ఆయ‌న చేసిన అభివృద్ధి గురించి గొప్ప‌లు చెప్తారు. ‘‘ఢిల్లీ మోడల్’’ గురించి మాట్లాడుతారు. అయితే ఆరోగ్యం, చ‌దువు మొదలైన కీలక రంగాల్లో ఢిల్లీ వెన‌క‌బ‌డి ఉంది. ఈ అంశాల్లో పుదుచ్చేరి ముందు వ‌రుస‌లో ఉంది. ఆయ‌న ముందు పుదుచ్చేరి నుంచి నేర్చుకోవాలి’’ అంటూ చెప్పారు. 

కాగా ఇటీవ‌ల అర‌వింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దేశ రాజధానిలోని ప్రభుత్వ పాఠశాలలను మార్చిందని చెప్పారు. పాఠ‌శాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యను మెరుగుపరిచామని తెలిపారు. దీంతో న‌గ‌రంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను విడిచిపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరార‌ని అన్నారు. 

ఏప్రిల్ 10వ తేదీన కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌లో గుజరాత్‌లో బీజేపీ ప్ర‌భుత్వం మంచి పాఠశాలలను ఇవ్వలేకపోయిందని అన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన, నాణ్యమైన విద్యను అందిస్తుందని చెప్పారు. అయితే ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ఢిల్లీలోని 800 స్కూళ్లకు ప్రిన్సిపాల్స్ లేరంటూ వీడియోను షేర్ చేశారు. ఢిల్లీలో సెకండరీ ఎడ్యుకేషన్‌లో డ్రాపౌట్స్ (13.8 శాతం) సంఖ్య పుదుచ్చేరి (7.9 శాతం)గా ఉంద‌ని అన్నారు. అంటే పుదుచ్చేరితో పోలిస్తే ఢిల్లీలో దాదాపు రెండు రేట్లు డ్రౌపౌట్స్ ఎక్కువ‌గా ఉన్నార‌ని అన్నారు. ఢిల్లీలోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే పుదుచ్చేరిలో రెట్టింపు సంఖ్య‌లో ఉన్నార‌ని ఆ వీడియో పేర్కొంది.

Scroll to load tweet…

RTI రిపోర్ట్ ను ఆధారంగా చేసుకొని ఢిల్లీలో ఇంకా 33,000 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీడియో పేర్కొంది. ఢిల్లీలో మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 1399 కాగా, పుదుచ్చేరిలో 298 ఉంద‌ని తెలిపింది. పుదుచ్చేరిలో 9 మంది విద్యార్థుల‌కు ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్నారని, అయితే ఢిల్లీలో ఈ సంఖ్య 31 అని ఆ వీడియో తెలిపింది.