కరోనా సోకిందనే భయంతో ఓ ఐఆర్ఎస్ అధికారి కారులోనే యాసిడ్ తాగి ఆత్మహత్య  చేసుకున్న విషాద ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన 56 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారి ద్వారక జిల్లాలో కారులో యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 కారులో ఓ వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉన్నాడని పోలీసులకు అందిన సమాచారం మేర అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ప్రకటించారు. కారులో సూసైడ్ నోట్ లభించింది. 

తనకు కరోనా సోకిందనే భయంతో, తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందులు పడకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నానని ఐఆర్ఎస్ అధికారి తన సూసైడ్ నోట్ లో రాశారు. కాగా ఐఆర్ఎస్ అధికారికి జరిపిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. 

ఐఆర్ఎస్ అధికారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. సదరు అధిాకారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.