భార్యతో భర్త బలవంతపు శృంగారం చేయడాన్ని నేరంగా చూడాలా? అనే విషయంపై దీర్ఘకాలంగా చర్చ జరుగుతున్నది. దీనిపై ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పు వెలువరించింది. ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించారు. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ఇచ్చింది. 

న్యూఢిల్లీ: భార్యకు ఇష్టం లేకున్నా భర్త బలవంతంగా శృంగారం చేయడం నేరమా? వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలా? అనే అంశంపై దీర్ఘకాలంగా విస్తృత చర్చ జరుగుతున్నది. ఇప్పటికే పలు హైకోర్టుల్లోనూ ఈ అంశంపై విచారణలు జరిగాయి. తాజాగా, ఢిల్లీ హైకోర్టు మ్యారిటల్ రేప్‌పై విచారణ జరిగింది. ఈ అంశాన్ని విచారించిన ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇచ్చారు. దీంతో ఇప్పుడీ అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చి ఆగింది.

భార్యతో బలవంతపు శృంగారం నేరమా? కాదా? అనే అంశంపై జస్టిస్ హరి శంకర్, జస్టిస్ రాజీవ్ శక్దెర్ విచారించారు. వీరిద్దరు న్యాయమూర్తులు ఈ అంవంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. భార్యపై భర్త చేసే లైంగిక చర్యలకు మినహాయింపు ఇచ్చే నిబంధన రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందా? లేదా? అనే విషయంపై ఇరువురూ భిన్న తీర్పులు వెలువరించారు. 

భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా అంటే రేప్ చేస్తే అది నేరంగానే పరిగణించాలని జస్టిస్ రాజీవ్ శక్దెర్ వివరించారు. ఇది ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘిస్తన్నదని తెలిపారు. కాగా, జస్టిస్ హరి శంకర్ ఇందుకు భిన్నమైన తీర్పు ఇచ్చారు. భార్య, భర్తల మధ్య వ్యవహారం కాబట్టి, ఈ చర్యను సమానత్వం, జీవించే స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నట్టు చూడరాదని వివరించారు. అయితే, వీరిద్దరూ ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

భార్య, భర్తల విషయమై రేప్‌పై ఇచ్చే మినహాయింపును కొట్టేయాలని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఫిబ్రవరి 21న రిజర్వ్‌లో పెట్టింది. భార్యపై భర్త అత్యాచారం విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 7న కోరింది. కానీ, కేంద్రం దీనికి మరింత సమయం కావాలని కోరింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ సాగిన ఈ విచారణను మరింత పొడిగించాలని ఢిల్లీ హైకోర్టు భావించలేదు. 

రేప్‌ లా ప్రకారం, భర్తకు మినహాయింపు ఉన్నది. భార్య మైనర్ కాకుండి ఉండి ఉంటే.. భర్త చేసే లైంగిక చర్యలను రేప్‌గా పరిగణించరాదనే మినహాయింపు చట్టంలో ఉన్నది. దీన్ని పలువురు సవాల్ చేశారు. కానీ, నేడు భిన్న తీర్పు రావడంతో పంచాయితీ సుప్రీంకోర్టు ముందుకు చేరినట్టయింది. ఆ పిటిషనర్లు అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.