ప్రజలు టీకాలు వేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం డయలర్ టోన్ పై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. సెల్ఫోన్ తో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ‘చిరాకెత్తించే’ ఈ సందేశం వస్తోంది. 

సరిపడా వ్యాక్సిన్లు లేనప్పటికీ ఈ సందేశాన్ని ఇస్తున్నారు.. అని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. టీకాలే లేనప్పుడు ప్రజలు వాటిని ఎలా పొందగలరని ప్రశ్నించింది.

వ్యాక్సిన్లను అందరికీ ఇవ్వాలి. డబ్బు తీసుకునైనా అందించాలి. చిన్నపిల్లలను అడిగా అదే చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించింది. ఒకటే సందేశం కాకుండా మరిన్ని సందేశాలను పెట్టాలని సూచించింది. 

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సిలిండర్లు, టీకాలు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చిన్నపాటి టీవీ కార్యక్రమాలు రూపొందించాలని యాంకర్లకు సూచించింది. వాటిని అన్ని చానళ్లలో ప్రసారం చేయాలని తెలిపింది. దీనికోసం అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖుల సాయం తీసుకోవాలని సూచించింది.

జైళ్లలో రద్దీ తగ్గించే అంశం మీద సుప్రీంకోర్టు ఆదేశాల అమలు కోసం పనిచేస్తున్న లాయర్లు, న్యాయాధికారుల్లో 18-44 యేళ్ల వయసు వారికి నేరుగా టీకాలను పొందే వీలుందా అని ఢిల్లీ హైకోర్టు ఆరా తీసింది. ‘తుపాకీ ఇవ్వకుండా యుద్ధానికి ెలా పంపగలమని’ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి గురువారం వ్యాఖ్యానించింది. 

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసమే వారు పనిచేస్తున్నారని జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం గుర్తు చేసింది. జిల్లా కోర్టుల్లోని టీకా కేంద్రాల్లో న్యాయాధికారులు, న్యాయ సహాయం అందించే లాయర్లకు తక్షణం టీకాలు ఇచ్చేలా కేంద్రానికి, డిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.