ఇద్దరూ ఇష్టపూర్వకంగానే శారీరకంగా ఒక్కటైనా ఆ సమయంలో కొన్నిపనులు నేరంగానే పరిగణించాల్సి వస్తుందని డిల్లీ హైకోర్టు పేర్కొంది.
న్యూడిల్లీ : ఇద్దరు ఇష్టపడి శారీరకంగా కలిసినా ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడం నేరమేనని డిల్లీ హైకోర్టు తేల్చింది. ఇలా తీసే ఫోటోలు,వీడియోలు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది. కాబట్టి అనుమతితోనే ఇద్దరు సెక్స్ లో పాల్గొన్నా ఫోటోలు, వీడియోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేరమేనని డిల్లీ హైకోర్టు తెలిపింది.
ఓ అత్యాచార ఘటనలో నిందితుడి బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తెలిపారు. వెంటనే కాకున్న భవిష్యత్ లో ఈ ప్రైవేట్ ఫోటోలు దుర్వినియోగం అయ్యే అవకాశం వుంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
లైంగిక సంబంధ కేసుల్లో ఇద్దరి అనుమతి వుండే శారీరకంగా కలిసినప్పటికీ ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి, సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడానికి అనుమతించినట్లు కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇది ఒకరి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించడం లేదా అవమానించడం అవుతుందన్నారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాన్ని నేరంగా పరిగణించాల్సి వస్తుందన్నారు.
