ఇద్దరు వయోజనులు భార్యాభర్తలుగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కులం, సమాజంతో సంబంధం లేకుండా వివాహం జరిగినప్పుడు .. ప్రత్యేకించి తమ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై వుందని కోర్ట్ పునరుద్ఘాటించింది
ఇద్దరు వయోజనులు భార్యాభర్తలుగా (two consenting adults ) కలిసి జీవించాలని నిర్ణయించుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరూ జోక్యం చేసుకోవడానికి అధికారం లేదని ఢిల్లీ హైకోర్టు (delhi high court) స్పష్టం చేసింది. అలాగే వారి కుటుంబాలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందున సదరు జంటకు భద్రతను కల్పించాలని ధర్మాసనం ఢిల్లీ పోలీసులను శనివారం ఆదేశించింది. కులం, సమాజంతో సంబంధం లేకుండా వివాహం జరిగినప్పుడు .. ప్రత్యేకించి తమ పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై వుందని కోర్ట్ పునరుద్ఘాటించింది.
తమ ఫ్రేమ్ వర్క్‌లోని రాజ్యాంగ న్యాయస్థానాలకు ప్రత్యేకించి ప్రస్తుత వివాదానికి సంబంధించిన కేసులలో పౌరులను రక్షించడానికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం వుందని ఢిల్లీ హైకోర్ట్ స్పష్టం చేసింది. ఇద్దరు వయోజనులు భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి అంగీకరించిన తర్వాత వారి కుటుంబంతో సహా థర్డ్ పార్టీ నుంచి వారి జీవితంలో జోక్యం చేసుకోరాదని.. ఈ మేరకు మన రాజ్యాంగం దానిని నిర్ధారిస్తుందని కోర్ట్ పేర్కొంది.
దేశంలోని పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడటం రాష్ట్ర కర్తవ్యం మాత్రమే కాదని.. దాని యంత్రాంగం, ఏజెన్సీల బాధ్యత కూడా అని జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. తమకు పోలీసుల రక్షణ కోరుతూ ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందే తాము వివాహం చేసుకున్నామని బాధితురాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళ తండ్రి ఉత్తరప్రదేశ్‌లో రాజకీయంగా పలుకుబడి వున్న వ్యక్తి అని.. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలడని పిటిషనర్ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు.
అందువల్ల వారి భద్రత రీత్యా వచ్చే మూడు వారాల పాటు రెండు రోజులకొకసారి దంపతుల నివాసాన్ని తనిఖీ చేయాలని ఢిల్లీ పోలీస్ బీట్ అధికారులను కోర్ట్ ఆదేశించింది. ఏదైనా బెదిరింపు లేదా ఎమర్జెన్సీకి సంబంధించి పిటిషనర్ల నుంచి ఏదైనా కాల్ వస్తే వెంటనే స్పందించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ల తరపున ముంతాజ్ అహ్మద్, సతీశ్ శర్మ వాదనలు వినిపించారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున అడిషనల్ స్టాండింగ్ కౌన్సెల్ (క్రిమినల్) కమ్నా వోహ్రాతో పాటు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముఖేశ్ కుమార్ వాదనలు వినిపించారు.
