రాజ్యసభ సభ్యునిగా వున్న సమయంలో కేంద్రం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఆయన పదవీకాలం పూర్తయ్యింది. 

బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయనను బుధవారం ఆదేశించింది. ఇందుకోసం 6 వారాల గడువు విధించింది. కాగా.. 2013లో బీజేపీలో చేరిన సుబ్రహ్మణ్యస్వామి... 2016లో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఆయన పదవీకాలం పూర్తయ్యింది. 

ఇకపోతే.. గత నెలలో సుబ్రమణ్యస్వామి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడం కలకలం రేపింది. దాదాపు అరగంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క విష‌యాల‌ను చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఈ భేటీ అనంత‌రం సుబ్ర‌మ‌ణ్య స్వామి స్వయంగా ట్వీట్ చేస్తూ మమతా బెనర్జీని ప్రశంసించారు.

సమావేశం అనంతరం స్వామి ట్వీట్ చేస్తూ, "నేను కలిసిన లేదా పనిచేసిన రాజకీయ నాయకులందరిలో, JP (జయప్రకాష్ నారాయణ్), మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, PV నరసింహారావు నుండి మమతా బెనర్జీ వ‌ర‌కు. ఈ నేతల మాటలు, చేష్టలు చాలా భిన్నంగా ఉంటాయి. భారత రాజకీయాల్లో ఇదో అరుదైన లక్షణం. అని పేర్కొన్నారు.

గ‌తంలో ఆఫీస్‌ బేరర్లను నియమించేందుకు బీజేపీ సంస్థాగత ఎన్నికలను దూరం పెట్టిందన్న సుబ్రమణ్యస్వామి .. ప్రధాని మోదీ ఆమోదంతోనే సభ్యులంతా నామినేట్‌ అవుతున్నారని ఆరోపించారు. ఆఫీస్‌ బేరర్ల నియామకాలన్నీ పార్టీలో ఎన్నికల ద్వారానే జరిగేవని సుబ్రమణ్యస్వామి గుర్తుచేశారు.