నిర్భయ కేసు దోషుల ఉరితీతపై స్టే: హైకోర్టులో సవాల్ చేసిన కేంద్రం
నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన స్టేను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. స్టేను ఎత్తేసి, విడివిడిగా ఉరి తీయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది.
ఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరితీతపై పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన స్టేను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది.
జస్టిస్ సురే,్ కుమార్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఆ పిటిషన్ పై విచారణ జరుపుతుంది. దోషులను విడివిడిగా ఉరి తీసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు తీహార్ జైలు అధికార యంత్రాంగం ఆ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read: నిర్భయ కేసు దోషుల మరో ఎత్తు: రాష్ట్రపతికి అక్షయ్ ఠాకూర్ మెర్సీ పిటిషన్
నిర్భయ కేసులోని నలుగురు దోషులు విడివిడిగా రివ్యూ పిటిషన్లు, క్యూరేటివ్ పిటిషన్లు, మెర్సీ పిటిషన్లు వేస్తున్నారు. దీంతో ఉరిశిక్షను అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగులో ఉన్న నేపథ్యంలో ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ దోషులు పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు స్టే ఇచ్చింది.
తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఉరిశిక్ష తేదీని ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి తోసిపుచ్చిన నేపథ్యంలో అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు.
డెత్ వారంట్ జారీ అయిన నేపథ్యంలో దోషులు విడివిడిగా క్యూరేటీవ్, రివ్యూ పిటిషన్లు వేయడంతో పాటు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్లు పెట్టుకుంటున్నారని హోం మంత్రిత్వ శాఖ తన పిటిషన్ లో తెలిపింది. న్యాయ ప్రక్రియను వాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని చెప్పింది.
Also Read: నిర్భయ కేసు: వినయ్ శర్మ మెర్సీ పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి
2012లో వైద్య విద్యార్థినిని రేప్ చేసి, హత్య చేసిన కేసులో నలుగురికి ఉరిశిక్ష పడింది. ఈ కేసులో ఓ నిందితుడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మరో నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురికి ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, పాటియాలా హౌస్ కోర్టు స్టే ఇవ్వడంతో అది ఆగిపోయింది.