న్యూఢిల్లీ: రోహిణి ప్రాంతంలో మూడు వేర్వేరు సంఘటనలో 12కు పైగా కార్లకు, రెండు బైకులకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 23వ తేదీన నిప్పుపెట్టారు. పోలీసులు వీటిని వేర్వేరు కేసులుగా నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. ఈ విచారణలో 19 సంవత్సరాల ఆకాష్ అనే వ్యక్తి మరో 30 సంవత్సరాల కుల్దీప్ అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డట్టు తెలిసింది. 

వీరిని అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టాక విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆకాష్ మద్యానికి బానిస. గతంలో ఒక మహిళ ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు ఆకాష్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు, దీనితో ఆ ప్రాంత ప్రజలపై, పోలీసులపై కసి పెంచుకున్నాడు. పగతో రగిలిపోతున్న ఆకాష్ ఎలాగైనా పోలీసులకు, ఆ ప్రాంత పోలీసులకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 

మరో మిత్రుడు కుల్దీప్ సహాయాన్ని అర్థించాడు. నేరంలో భాగస్వామి అవ్వడానికి కుల్దీప్ కూడా అంగీకరించాడు. కుల్దీప్ సహాయంతో ఆకాష్ సెప్టెంబర్ 23 అర్థ రాత్రి జేజే నగర్ కాలనీలో 3కార్లు ఒక బైక్ కు నిప్పంటించి పరారయ్యారు. మరుసటిరోజు రాత్రి శివ విహార్, భగత్ సింగ్ కాలనీలో మరో నాలుగు బైకులు 6 కార్లకు నిప్పంటించారు.