డిల్లీలో సంజీవని, మహిళా సమ్మాన్ యోజన అమలవుతోందా? : ప్రభుత్వం క్లారిటీ
గతంలో ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ఉచిత హామీలను ప్రకటించారు. ఈ హామీలు ప్రస్తుతం అమలవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత?
న్యూ ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో చాలా కీలకమైన హామీలు వున్నాయి... అవే సంజీవని, మహిళా సమ్మాన్ యోజన. అయితే ఈ రెండు పథకాలు ప్రస్తుతం డిల్లీ ప్రభుత్వం అమలుచేస్తోంది... దరఖాస్తులను ఆహ్వానిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డిల్లీ హెల్త్ డిపార్ట్ మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సంజీవని, మహిళా సమ్మాన్ యోజన వంటి పథకాలు అధికారికంగా అమలులో లేవని స్పష్టం చేశాయి. ఈ పథకాలకు సంబంధించి జరుగుతున్న రెజిస్ట్రేషన్లు అన్నీ తప్పుదోవ పట్టించేవిగా పేర్కొన్నారు.
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఈ ప్రకటన చేయడం కీలకంగా మారింది. ఆప్ కార్యకర్తలు ఈ రెండు పథకాల గురించి ప్రచారం చేస్తున్నారని గుర్తించిన కేంద్ర ఈ చర్యలు తీసుకుంది.
ఢిల్లీ ఆరోగ్య శాఖ నోటీసుల్లో ఏముంది?
ఢిల్లీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 'సంజీవని యోజన' గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఢిల్లీలో సంజీవని యోజన అనే పథకం ప్రచారంలో ఉంది... దీనిలో 60 ఏళ్లు పైబడిన వారికి ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులలో (ప్రభుత్వ, ప్రైవేట్) ఆదాయ పరిమితులు లేకుండా ఉచిత చికిత్స అందిస్తామని చెబుతున్నారు. అనధికారిక వ్యక్తులు రిజిస్ట్రేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నారు, వృద్ధుల నుండి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. నకిలీ ఆరోగ్య కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అలాంటి పథకం ప్రారంభించలేదు. సంజీవని యోజన కింద ఉచిత చికిత్స అనే వాదనను నమ్మవద్దు అని హెచ్చరించారు.
ఇదంతా ఆప్ ఎన్నికల స్టంటేనా?
డిల్లీ ప్రభుత్వ, మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదలచేసిన నోటీస్ లో కీలక విషయాలు వెల్లడించారు. సంజీవని యోజన రాష్ట్రంలో అమలుకావడం లేదు... కానీ ఇది అమలవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.. సోషల్ మీడియాలోనే కాదు పలు వార్తా ఛానెల్‌లు,ప్రింట్ మీడియా ద్వారా ఈ ప్రచారం జరుగుతున్న విషయం ఢిల్లీ ప్రభుత్వ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఢిల్లీ ప్రజల ఆదాయంతో సంబంధం లేకుండా 60 ఏళ్లు పైబడిన వృద్దులకు అన్ని ఆసుపత్రులలో (ప్రభుత్, ప్రైవేట్) ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇందులో నిజం లేదని... ఈ పథకం అమలులో లేదని తేల్చారు.
డిల్లీ ప్రభుత్వంలోని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖలు ఇప్పటివరకు సంజీవని యోజన పేరిట ఏ పథకాన్ని అమలుచేయడంలేదని తెలిపారు. అలాగే ఈ పథకం కోసం ఎలాంటి దరఖాస్తులను కూడా ఆహ్వానించడంలేదని... ఆరోగ్యశాఖ అధికారులకే కాదు ఎవరికీ ఈ పథకం పేరిట వివరాలు సేకరించడానికి అధికారం ఇవ్వలేదన్నారు. వృద్దుల నుండి వ్యక్తిగత సమాచారం, ఇతర డేటా సేకరించడం లేదు... అలాగే వారికి ఎటువంటి కార్డును అందించడం లేదని ప్రభుత్వం తెలిపింది.
దేశ రాజధాని డిల్లీలోని మహిళలు,సీనియర్ సిటిజన్లకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తామని డిసెంబర్ 12న కేజ్రీవాల్ ప్రకటనలు చేసారు. కొద్ది రోజులకే ప్రభుత్వం నోటీసు విడుదలవడం ఆసక్తికరంగా మారింది. ఆప్ హామీలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా వున్నాయంటున్నారు. ఈ నోటీసులు రాబోయే ఎన్నికలకు ముందు ఆప్ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ “మహిళా సమ్మాన్ యోజన”ను ప్రకటించారు... దీని కింద ఢిల్లీలోని ప్రతి మహిళ నెలకు రూ.1,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత దీన్ని అమలు చేస్తామని... ఈ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని హామీ ఇచ్చారు. అదే సమయంలో అతను "సంజీవని యోజన"ను ప్రవేశపెట్టాడు, ఇది సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య చికిత్సను అందించే పథకం. ఇందుకోసం ప్రభుత్వం అర్హుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఎన్నికల ముగిసే వరకు నిధుల బదిలీ జరగదని తెలిసినప్పటికీ ఈ పథకాల కోసం ఇంటింటికీ రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. అయిత ఢిల్లీ ప్రభుత్వం నుండి వచ్చిన తాజా నోటీసు ప్రకారం ఈ పథకాలను అమలు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని అర్థమవుతోంది. ఇది ఆప్ ఎన్నికల స్టంట్ అని తెలుస్తోంది