మరో రెండ్రోజులు పాఠశాలలకు సెలవులు.. వరద బాధిత కుటుంబాలకు సీఎం ఆర్థిక సాయం..
Delhi Floods: ఢిల్లీలో యమునా నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికి ఇంకా చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నీటిని తోడేయడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

Delhi Floods: దేశరాజధాని ఢిల్లీలో యమునా వరద నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. ఇవాళ కూడా భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. మరోవైపు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.10,000 సాయం అందించనుంది.
సహాయ శిబిరాన్ని సందర్శించిన కేజ్రీవాల్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోరీ గేట్ సహాయ శిబిరాన్ని సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వరదబాధితులను పరామర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే.. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లు, ఆస్పత్రులు, శ్మశానవాటికలు, షెల్టర్ హోమ్ లోకి కూడా వరద నీరు చేరింది. దాదాపు ప్రతి ఒకటి నీటమునిగాయి. ఇప్పటికీ రాజ్‌ఘాట్ నుంచి సచివాలయం రోడ్డంతా వర్షం నీటితో నిండిపోయింది.
ఈ సందర్భంగా వరదల కారణంగా చాలా నష్టపోయిన ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం కూడా ఒక మార్గాన్ని అన్వేషిస్తోందని, తద్వారా వారి నష్టాన్ని పూడ్చుకోవచ్చని అన్నారు. ఢిల్లీలో యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో పాటు జనజీవనం కూడా సాధారణం అవుతోందన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అతిషి, వరద సహాయానికి ప్రభుత్వం నియమించిన సెంట్రల్ ఢిల్లీ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మరో రెండ్రోజులు పాఠశాలలకు సెలవులు
దీంతో పాటు వరదల దృష్ట్యా యమునా నదికి ఆనుకుని ఉన్న పాఠశాలల్లో సహాయక శిబిరాలు నిర్వహించే అవకాశం ఉందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీని కారణంగా జులై 17, 18 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభావిత జిల్లాలు - తూర్పు, ఈశాన్య, వాయువ్య-A, ఉత్తరం, మధ్య, ఆగ్నేయ ప్రాంతాలకు ఈ ఆర్డర్ వర్తిస్తుంది.
ప్రమాదకర స్థాయిలో యమునా నది నీటి మట్టం
గత వారం రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తున్న నది బుధవారం నాటికి 207.71 మీటర్లకు చేరుకుంది, 1978లో నెలకొల్పిన 207.49 మీటర్ల ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టి, ఢిల్లీలోని పలు ప్రధాన ప్రాంతాలను నీటమునిగాయి. ఈసారి నీటిమట్టం 208.66 మీటర్లకు చేరింది. గత సారి కంటే 1.17 మీటర్లు ఎక్కువ. డేంజర్ మార్క్ (205.33 మీటర్లు) కంటే 3.33 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం యమునా నీటిమట్టం 205.78 మీటర్లుగా నమోదైంది. ఈ రాత్రికి యమునా నీటి మట్టం ప్రమాదకర స్థాయికి దిగువకు చేరుతుందని అంచనా. ఢిల్లీలో యమునా వార్నింగ్ పాయింట్ 204.50 మీటర్లు.