Delhi Liquor Scam Case : కేజ్రీవాల్ బెయిల్ కోసం అంత ఖర్చయ్యిందా..! అదంతా ప్రజాధనమేనా..!!
డిల్లీ లిక్కర్ స్కాం నుండి బయటపడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తో మరికొందరు నాయకులు న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే వీరు తమ జేబుల్లోంచి కాకుండా ప్రజాధనాన్ని న్యాయవాదులకు చెల్లిస్తున్నారట. కేవలం కేజ్రీవాల్ బెయిల్ కోసమే ఆప్ సర్కార్ ఎంత ఖర్చు చేసిందంటే...
డిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపారులు అరెస్టయ్యారు. చివరకు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కూడా అరెస్టయ్యారు. అయితే ఇటీవలే కేజ్రీవాల్ బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చారు. ఈ బెయిల్ వెనక కూడా మరో చీకటి కోణం దాగివుందన్న ప్రచారం ఆప్ సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టింది. తమ స్వార్థ రాజకీయాల కోసం లిక్కర్ స్కాం కు పాల్పడిన కేజ్రీవాల్ ఆండ్ టీం ఇప్పుడు దాన్నుంచి బయటపడేందుకు కోట్లాది రూపాయలు నీళ్ళలా ఖర్చు చేసారట... అదంతా ప్రజాధనమేనట. ఇలా సీఎం కేజ్రీవాల్ ను జైలు నుండి బయటకు తీసుకువచ్చేందుకు ఆప్ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందో లెక్కలతో సహా బయటకు వచ్చింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, డిల్లీ హైకోర్టులతో పాటు వివిధ న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఆప్ నేతలే. దీంతో ఈ కేసు నుండి తమ నేతలను కాపాడేందుకు ఆప్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది. ఈ కేసులో ఆప్ నేతల తరపున వాదనలు వినిపిస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. ఇందుకు గాను ఆయనకు గత ఏడాదిన్నర కాలంలోనే ఆప్ ప్రభుత్వం ఏకంగా రూ.18.97 కోట్లు చెల్లించింది.
ఇక మరో న్యాయవాది రాహుల్ మెహ్రా కూడా డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేతల తరపున వాదిస్తున్నారు. ఆయనకు కూడా రూ. 5.30 కోట్ల రూపాయలను ఇప్పటిరకు ఆప్ ప్రభుత్వం చెల్లించింది. ఇలా ఇప్పటివరకు రూ.21.50 కోట్లను లిక్కర్ కేసు కోసం ఆప్ ప్రభుత్వం ఖర్చు చేసిందట. ఈ వివరాలు బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఆప్ సర్కార్ ఇప్పటివరకు రెండుసార్లు డబ్బు చెల్లించింది. ఒకసారి రూ.14 కోట్ల 85 లక్షలు, రెండోసారి రూ.12 లక్షల 50 వేలు చెల్లించింది. మరో లాయర్ రాహుల్ మెహ్రాకు మూడుసార్లు చెల్లించారు. మొదటి సారి రూ.24 లక్షల 5 వేలు, రెండోసారి రూ.3 కోట్ల 93 లక్షల 5 వేలు, మూడోసారి రూ.1 కోటి 37 లక్షల 75 వేలు... ఇలా మొత్తంగా రూ.5 కోట్ల 30 లక్షల 25 వేలు చెల్లించారు. ఈ డబ్బంతా వివిధ ప్రభుత్వ శాఖల నుండి చెల్లించారు. ఏయే శాఖల నుండి ఎంత చెల్లించారన్న వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
ఇక మద్యం కుంభకోణంలో ఆప్ నాయకుల తరపున పి.చిదంబరం, కపిల్ సిబల్, ఇందిరా జైసింగ్ వంటి మరికొందరు న్యాయవాదులు కూడా పనిచేసారు. సీఎం కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా బెయిల్ కోసం డిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇలా సెషన్స్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు డిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతోంది. దీంతో ఆప్ తరపున ఎంతమంది లాయర్లు పనిచేసారు? వారికి ఇప్పటివరకు ఎంత ఫీజు చెల్లించారు? అది కూడా ప్రభుత్వమే చెల్లించిందా? అన్నది తెలియాల్సి వుంది. ఏదేమైనా చిన్న రాష్ట్రమైన డిల్లీ కేవలం న్యాయవాదులకే కోట్లాది రూపాయలు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.