కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బదిలీ-పోస్టింగ్ హక్కులను అప్పగించింది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా కోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీల సమావేశంలోనూ కేజ్రీవాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు.
అధికారుల బదిలీ పోస్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను వెంటనే నిషేధించాలని ఆప్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఢిల్లీలోని గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, వారిపై క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేస్తూ గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ను ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు, ఢిల్లీలోని పోలీసు, శాంతిభద్రతలు, ఇతర అన్ని సేవల నియంత్రణను సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదని, ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
ప్రతిపక్ష పార్టీల మద్దతు
ఈ విషయమై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలువురు నేతల మద్దతు కోరారు. ఈ క్రమంలో పలు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు విపక్ష నేతలు ఆప్‌కు మద్దతు పలికారు.
ఈ క్రమంలో పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలోనూ కేజ్రీవాల్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశంపై జూన్ 11న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నిరసనలు
జూలై 3న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆర్డినెన్స్ కాపీలను దహనం చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం తెలిపింది. జులై 3న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఈ ఆర్డినెన్స్ కాపీలను ఐటీఓ పార్టీ కార్యాలయంలో దహనం చేస్తారని ఆప్ అధికార ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కానీ ఇప్పుడు ఈ నిరసన కూడా రద్దు చేయబడింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అందుకే తాను నిరసనలో పాల్గొనబోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటన తర్వాత, ఇప్పుడు పార్టీ కూడా నిరసనను రద్దు చేసింది.
