న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత షీలా దీక్షిత కన్ను మూశారు. ఆమె వయస్సు 81 ఏళ్లు. ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1938 మార్చి 31వ తేదీన పంజాబ్ లోని కపుర్తలలో జన్మించారు. అత్యధిక కాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత షీలా దీక్షిత్ ది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె 15 ఏళ్ల పాటు పనిచేశారు.

షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరుసగా శానససభకు ఎన్నికయ్యారు. ఢిల్లీకి ఆమె ఆరో ముఖ్యమంత్రిగా పనిచేశారు.1998, 2008 ఎన్నికల్లో గోల్ మార్కెట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి పోటీ చేసి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు.

షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెసు చీఫ్ గా ఉన్నారు. ఆమె 2004లో కేరళ గవర్నర్ గా పనిచేశారు. అయితే ఆమె ఆ పదవిలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. .  

ఆమెకు కుమారుడు సందీప్ దీక్షిత్, కూతురు లతిక దీక్షిత్ సయ్యద్ ఉన్నారు. సందీప్ దీక్షిత్ కాంగ్రెసు నాయకుడు.

ఇటీవలి 2019 లోకసభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి, సినీ నటుడు మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆమె 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీ ఫ్లైఓవర్లు, మెట్రో, రోడ్లు విస్తరించాయి.