న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొద్ది గంటల ముందు దారుణం జరిగింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ప్రీతి అహ్లావత్ ను ఒ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. ప్రీతి ఢిల్లీలోని పట్ పడ్ గంజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు. 

శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆమెను హత్య చేశాడు. ఇంటికి నడిచి వెళ్తున్న సమయంలో ఓ యువకుడు ఆమె వెనక వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు తూటాలు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. మరో తూటా సమీపంలోని కారు అద్దాలకు తగిలింది. దాంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

కాల్పులు జరిగిన వెంటనే ప్రీతి కిందపడియో అక్కడికక్కడే మరణించింది. కాల్పులు జరిపిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. 

మెట్రో స్టేషన్ నుంచి ఇంటి వైపు వెళ్తుండగా ప్రీతిని రాత్రి 9.30 గంటల ప్రాంతంలో యువకుడు కాల్చి చంపాడు. అహ్లావత్ ను చంపిన తర్యాత ఆమె బ్యాచ్ మేట్ దీపాన్షు రతి హర్యానాలోని సోనిపట్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అతను కూడా 2018 బ్యాచ్ కు చెందినవాడే. అతను ప్రీతిని ప్రేమించాడని, ఆమె అందుకు అంగీకరించలేదని అంటున్నారు. 

 

ఢిల్లీ శాసనసభకు ఉన్న 70 స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆప్, బిజెపి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.