న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో 111 ఏళ్ల వయస్సు గల మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శనివారంనాటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటేసిన అతి ఎక్కువ వయస్సు గల మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కలితార మండల్ అనే మహిళ సిఆర్ పార్క్ లోని పోలింగ్ బూత్ లో తన కుమారుడు, మనువడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇంకు పెట్టిన వేలిని ఫొటోగ్రాపర్లవైపు ఉంచి ఫోజులిచ్చారు. ఈ ఎన్నికల్లో ఓటేసినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎన్ని ఎన్నికల్లో ఓటేశానో తనకు గుర్తు లేదని, అయితే బాధ్యత గల పౌరులుగా తప్పకుండా ఓటేయాలని ఆమె అన్నారు. 

అవిభాజిత భారతదేశంలోని బరిసాల్ లో ఆమె 1908లో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం బంగ్లాదేశ్ లో ఉంది. భారత ఉపఖండం గురైన పలు ఒడిదొడుకులను ఆమె చూశారు. రెండు విభజనలను చూశారు. భారత దేశంలో తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు సార్లు శరణార్థిగా ఉన్నారు. చివరకు ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 

వందేళ్ల వయస్సు గల ఓటర్లు ఢిల్లీలో 132 మంది ఉన్నారు. ఇందులో 68 మంది పురుషులు కాగా, 64 మంది మహిళలు. గత శతాబ్దంలోని అన్ని ఎన్నికల్లో మండల్ పాల్గొన్నారు. ఓటేయడానికి బ్యాలెట్ బాక్స్ లు వాడిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. 

పోలింగ్ అధికారులు వేలి ముద్రలు తీసుకుని, బ్యాలెట్ పేపర్ ఇచ్చి దాన్ని మడిచి, బ్యాలెట్ బాక్సుల్లో వేసే ఓటింగ్ విధానాన్ని తాను చూసినట్లు ఆమె తెలిపారు. తాను పెద్ద యంత్రాల  (ఈవిఎంల) ద్వారా కూడా ఓటేశానని చెప్పారు. 

బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసిన 1971 ఇండో - పాకిస్తాన్ వార్  తర్వాతి నుంచి మండల్ దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ బెంగాలీ ఎంక్లేవ్ ఉన్న సీఆర్ పార్క్ ఏరియాలో  తన నాలుగు తరాల తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. 

కె. బ్లాక్ లోని ఆమె ఇంటి నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హరీష్ కుమార్ ఆమెను తీసుకుని వచ్చారు. ఈ పని చేసినందుకు తనకు ఆశీస్సులు అందినట్లు భావిస్తున్నానని ఆయన అన్నారు. దంతాలు అన్నీ పోయినప్పటికీ తనకు ఇష్టమైన చేపల కూరను మాత్రం తింటూ ఉంటారు. ప్రతి ఎన్నికల్లో ఓటేస్తారు.