న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రాష్ట్రంలో  ఉల్లి ధరల పెరుగుదల ప్రభావం  ఏ మాత్రం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపలేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఉల్లి ధరల ప్రభావం పనిచేయలేదు. గతంలో ఉల్లి ధరల పెరుగుదల బీజేపీ ప్రభుత్వాలను కూల్చడంలో కీలక పాత్ర పోషించింది.కానీ, ఈ దఫా మాత్రం ఆ ప్రబావం నుండి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకొన్నారు.

1993లో ఢిల్లీ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది.  1993 డిసెంబర్ 2 వ తేదీ నుండి  1996 ఫిబ్రవరి 26వ తేదీ వరకు బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది. మదన్ లాల్ ఖురానా ఆ సమయంలో ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 

1996 ఫిబ్రవరి 26వ తేదీ నుండి 1998 డిసెంబర్ 3వ తేదీ వరకు బీజేపీకి చెంది సాహెబ్ సింగ్ వర్మ ఢిల్లీ సీఎంగా  పనిచేశారు.1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ నుండి  బీజేపీ నుండి సుష్మా స్వరాజ్ సీఎంగా పనిచేశారు. 

ఎన్నికలకు మూడు మాసాల ముందు బీజేపీ నాయకత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిలో సుష్మా స్వరాజ్‌ను నియమించింది. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు విపరీతతంగా పెరిగాయి. ఢిల్లీలో కూడ ఉల్లి ధరల ప్రభావం  ఎన్నికల్లో కన్పించింది. 

సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజల కోసం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చే ప్రయత్నంచేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా సుష్మా స్వరాజ్ ప్రయత్నాలు చేశారు. 

కానీ ఆ ఎన్నికల్లో  బీజేపీ ఓటమి పాలైంది. 1998 డిసెంబర్ 3వ తేదీ నుండి 2003 డిసెంబర్ 1వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్  సీఎంగా పనిచేశారు. తొలిసారిగా ఆమె సీఎంగా ఢిల్లీలో బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత వరుస ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. హ్యాట్రిక్ సీఎంగా ఆమె రికార్డు సృష్టించారు.

Also read:ఢిల్లీలో హ్యాట్రిక్ సీఎంలు: నాడు షీలా దీక్షిత్, గెలిస్తే నేడు కేజ్రీవాల్

1998 డిసెంబర్ మాసంలో  ఢిల్లీలో బీజేపీ ఓటమికి  ఉల్లి ధరలు తీవ్రమైన ప్రభావం చూపాయని ఆ సమయంలో రాజకీయ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉల్లి ధరల పెరుగుదల ప్రభావం కన్పించిందని ఆనాడు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

ఆ సమయంలో రాజస్థాన్ సీఎంగా ఉన్న భైరాన్‌సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను విపక్ష కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకొంది. ఉల్లిపాయ కంటే ఆపిల్ పండ్లు చాలా చౌక అని  ఆయన ప్రకటించారు. ఉల్లి బదులుగా ఆపిల్ తినాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇక  1999 చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీనికి కూడ ఉల్లి దరల ప్రభావం కారణమనే అభిప్రాయాలు అప్పట్లో వచ్చాయి.

అయితే ఇటీవల కాలంలో ఉల్లి ధరల  పెరుగుదల విపరీతంగా పెరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా  ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లి దొరికే పరిస్థితి కూడ లేకుండాపోయింది.

 ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో వరదల కారణంగా  ఉల్లి పంట దెబ్బతింది. ప్రజలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఎగుమతులపై  కేంద్రం నిషేధం విధించింది. 

ఉల్లి దెబ్బకు  బీజేపీని గద్దె దింపిన చరిత్ర  ఢిల్లీ ఓటర్లకు ఉంది. అయితే ఈ దఫా ఎన్నికల్లో ఉల్లి ప్రభావం పడకుండా కేజ్రీవాల్ జాగ్రత్తలు తీసుకొన్నారు. ఉల్లి కొరత లేదా ధర పెరుగుదల విషయంలో తన ప్రమేయం లేదని ఓటర్లను నమ్మించారు.

మరో వైపు ఐదేళ్లుగా ఆప్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారు.  కాంగ్రెస్ పార్టీ అసాధారణ స్థాయిలో విద్యుత్ రాయితీలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించింది. కానీ, ఢిల్లీ ప్రజలు మాత్రం నమ్మలేదు. అయితే  సంక్షేమ పథకాల విషయంలో  ఆప్ పై బీజేపీ చేసిన ప్రచారాన్ని కూడ ఓటర్లు నమ్మలేదని ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ను బట్టి చూస్తే అర్ధమౌతోంది.