న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హ్యాట్రిక్ దిశగా సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ లో తన స్పందనను పోస్టు చేశారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. 

Also Read: అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

భారత ఆత్మను రక్షించడానికి నిలబడినందుకు ఢిల్లీకి థాంక్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలకు ప్రశాంత్ కిశోర్ ధన్యవాదాలు తెలిపారు.  ఆమ్ ఆద్మీ పార్టీ 53 శాతానికి పైగా ఓట్లు సాధించింది. 2015 ఎన్నికల్లో 54 శాతం ఓట్లు సాధించింది.

 

ఆప్ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ శాసనసభలో 70 స్థానాలు ఉండగా ఆప్ 56 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. 14 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది. గత ఎన్నికల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుంది. బిజెపికి 3 సీట్లు మాత్రమే వచ్చాయి.

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు 21 కేంద్రాల్లో జరుగుతోంది. వీటిలో 11 జిల్లాల్లో 9 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడుతున్నాయి.