పాట్నా: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయంపై బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ ముక్కసరిగా ప్రతిస్పందించారు. మూడు పదాలతో తన స్పందనను తెలియజేశారు. జనతా మాలిక్ హై (ప్రజలే బాస్ లు) అని అన్నారు. ఆ మాటలు అని చేతులు మోడ్చి పైకెత్తి దండం పెడుతూ వెళ్లిపోయారు.

బిజెపి ఐకాన్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్మారక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్, ఇతర పార్టీ అగ్రనేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నితీష్ కుమార్ ను కేజ్రీవాల్ విజయంపై ప్రశ్నించారు. 

Also Read: చేయాల్సిన ప్రయత్నం చేశాం: ఢిల్లీ ఫలితాలపై గౌతమ్ గంభీర్

ఆయన వ్యాఖ్యలతో బిజెపి నేతలు సంతోషించే అవకాశాలేమీ లేవు, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు ప్రచారం చేసినప్పటికీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఫలితాలు సాధించలేకపోయింది. ఢిల్లీలోని 70 సీట్లలో బిజెపితో పొత్తు పెట్టుకుని జేడీయు రెండు సీట్లకు పోటీ చేసింది. 

బీహార్ కు చెందిన తన భాగస్వామికి ఢిల్లీలో బిజెపి సీట్లు కేటాయించడం ఇదే తొలిసారి. అమిత్ షాతో పాటు ప్రచార కార్యక్రమంలో నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వాళ్లు ఉచితాల గురించే మాట్లాడుతారని, వాస్తవమైన అభివృద్ధిని చేయరని ఆయన కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. 

Also Read: ఢిల్లీలో పోలింగ్ శాతం తగ్గినా ఆప్ ఎందుకు లాభపడింది?

కేజ్రీవాల్ విజయంలో గత నెలలో పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన ప్రశాంత్ కిశోర్ కీలక భూమిక పోషించడం కూడా నితీష్ కుమార్ ఫలితాలపై అంతగా స్పందించకపోవడానికి కారణమంటున్నారు. బీహార్ వెలుపల బిజెపికి జేడీయు మద్దతు తెలపడాన్ని ప్రశాంత్ కిశోర్ వ్యతిరేకించారు. చాలా రోజుల తర్వాత ప్రశాంత్ కిశోర్ ను, పవన్ వర్మను నితీష్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు.