న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్ స్పందించారు. తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తుందని ఆయన మంగళవారం సాయంత్రం అన్నారు. తమ పార్టీ చేయాల్సిన ప్రయత్నం చేసిందని, ప్రజలను నమ్మించలేకపోయామని ఆయన అన్నారు. 

విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తాము ఎంతో ప్రయత్నించామని, కానీ రాష్ట్ర ప్రజలను నమ్మించలేకపోయామని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఢిల్లీ అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: ఊడ్చేసిన కేజ్రీవాల్...బిజెపికి మరోసారి భంగపాటు

గౌతమ్ గంభీర్ నిరుడు జరిగిన లోకసభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి అతీషి మర్లేనాను ఓడించారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ తాము 55 సీట్లు గెలుస్తామని అన్నారు. తాము 48 ప్లస్ సీట్లు గెలుస్తామని, 55 సీట్లు గెలిచినా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. ఆయన ఆ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే బిజెపి పరిస్థితి పూర్తిగా తిరగబడింది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాలను గెలుచుకోగా, బిజెపి 7 స్థానాలను గెలుచుకుంది. గతంలో కన్నా బిజెపికి నాలుగు సీట్లు అదనంగా వచ్చాయి. కాంగ్రెసు ఈసారి కూడా ఖాతా తెరవలేకపోయింది. 

Also Read: ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్