న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను గెలిపించిన తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను గెలిపిచి ప్రశాంత్ కిశోర్ తన రెండో లక్ష్యాన్ని సమర్థంగా నిర్వహించారు. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకె అధినేత స్టాలిన్ కోసం ఆయన పనిచేస్తున్నారు. 

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తిరుగులేని విజయం సాధించిన తర్వాత భారత ఆత్మను నిలబెట్టడం కోసం నిలబడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు అంటూ ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ కోసం ఆయన దాదాపు ఆరు నెలలు పనిచేశారు. వ్యక్తిగత సమస్యలను అధిగమిస్తూ ఆప్ విజయానికి ప్రశాంత్ కిశోర్ పనిచేశారు. బిజెపితో జేడీయు పొత్తును వ్యతిరేకించినందుకు, సీఏఏపై వైఖరిని అడిగినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయనను పార్టీ నుంచి వెలివేశారు. 

Also Read: దేశ రాజధానిలో పాగా వేసిన ఆప్.... జాతీయ రాజకీయ పావులను కూడా కదపటం మొదలెట్టేసింది

ఆప్ విజయం ద్వారా ప్రశాంత్ కిశోర్ ఈ ఏడాది ఆఖరులో జరుగనున్న బీహార్ ఎన్నికల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సంకేతాలు పంపినట్లయింది. కేజ్రీవాల్ తో ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రశాంత్ కిశోర్ ఆయనకు ఒకే ఒక సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.

 ప్రత్యర్థులతో వాగ్వివాదాలకు దిగవద్దని, వారితో ఘర్షణ పడవద్దని చెబుతూ తాను అభివృద్ధికి కట్టుబడి ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రశాంత్ కిశోర్ కేజ్రీవాల్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. దాంతో కేజ్రీవాల్ తాను ఇచ్చిన హామీలను, వాటి అమలును కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. సీసీటీవీలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటివాటిని ప్రస్తావిస్తూ వచ్చారు. 

Also Read: ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్

ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడాన్ని కేజ్రీవాల్ విరమించుకున్నారు. బిజెపి ఓటర్లు కూడా ఆప్ నకు ఓటేసే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలతో వాగ్వివాదాలకు దిగడం మంచిది కాదని ప్రశాంత్ కిశోర్ కేజ్రీవాల్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రకటన వెలువడగానే కేజ్రీవాల్ తన రిపోర్టు కార్డును బయటకు తీశారు. ప్రతి నియోజకవర్గంలో 25 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాకుండా 15 వేల మంది ప్రభావిత వ్యక్తులకు ఆయన వ్యక్తిగతంగా లేఖలు రాశారు. తన ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలను కేజ్రీవాల్ ప్రజలకు చెబుతుండడంతో బిజెపికి ఆయనను ఎదుర్కోవడానికి ఏ విధమైన అంశాలు కూడా లభించలేదు.

ప్రధాని నరేంద్ర మోడీ నుంచి రామాలయ నిర్మాణం ప్రకటన వెలువడిన రోజునే మీడియాకు కేజ్రీవాల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో మీడియాలో కేజ్రీవాల్ కూడా ప్రధానమైన చోటును దక్కించుకున్నారు. బిజెపికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పకడ్బందీ పథకాన్ని రచించి అమలు చేయడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు