దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాగా... పలు నియోజకవర్గాల్లో సినీ, రాజకీయ ప్రముఖులు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరూ బద్దకంగా ఉండకూడదని.. ఓటు వేయడం చాలా ముఖ్యమని ఆమె అన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లు కూడా ఓటు వేశారు. 

విదేశాంగ మంత్రి జైశంకర్ తుగ్లక్ క్రిసెంట్ రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ ఎడ్యుకేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటు వేయండం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు.

మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ న్యూ ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో ఉన్న నిర్మాణ్ భవన్ లో ఏర్పాటు చేసిన పోలీస్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.భానుమతి తుగ్లక్ క్రిసెంట్  రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ ఎడ్యుకేషన్ లో ఓటు వేశారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆయన సతీమణి, కుమారుడితో కలిసి వచ్చి గ్రేటర్ కైలాష్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సీనియర్ బీజేపీ నేత ఎల్ కే అడ్వాణి, ఆయన కుమార్తె ప్రతిభ అడ్వాణి తో కలిసి వచ్చి ఔరంగజేబు లేన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో 1.47కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 81,05236 మంది పురురుషులు కాగా, 66,80,277మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 672మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. కాగా.. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏరక్పాట్లు చేశారు. 

మొత్తం 13,750 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. గత కొన్ని రోజులుగా ఢి్లీలో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో భద్రత కూడా భారీగా ఏర్పాటు చేశారు.మొత్తం 190 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. 40వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. 19వేల మంది హోంగార్డులు సైతం విధుల్లో పాల్గొంటున్నారు.