తప్పతాగి వాహనం నడిపిందే కాక... అడ్డుకున్న పోలీసునే కొట్టింది ఓ మహిళ. ఈ సంఘటన  దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ సమయంలో యువతితోపాటు... వాహనంపై మరో వ్యక్తి ఉన్నాడని... అతను కూడా మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఢిల్లీలోని మాయాపురిలో మంగళవారం సాయంత్రం ఓ  యువతి, మరో యువకుడు స్కూటీపై వెళుతున్నారు. కాగా... వారు హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడుపుతుండటంతో... వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాగా... తమ వాహనాన్ని అడ్డుకున్నందుకు ఆ ఇద్దరు యువతీయువకులు వీరంగం సృష్టించారు. తమను వెళ్లనివ్వాలంటూ పోలీసులపై గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టారు. ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించారు.

దీంతో... ఆ ట్రాఫిక్ పోలీసు వారి వాహనం తాళం లాగేసుకున్నాడు. దీంతో... కోపంతో ఊగిపోయిన యువతి.. ట్రాఫిక్ పోలీసుపై చెయ్యి చేసుకుంది. అంతేకాకుండా పోలీసు వద్ద నుంచి తాళం కూడా లాక్కుంది.  ఆమె చేసిన పనికి అక్కడ ఉన్నవారంతా నివ్వెరపోయారు. కాగా.. వారిద్దిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పీకలదాకా మద్యం సేవించడం వల్లే ఆ మహిళ అలా ప్రవర్తించిందని వారు చెబుతున్నారు.