ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించింది. పది రోజుల కస్టడీ కావాలని ఈడీ కోర్టును విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాను వారంపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపుతూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో ఆయనను ఏడు రోజుల కస్టడీ విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాకు ప్రత్యక్ష పాత్ర ఉన్నదని, ఆయన ఆదేశాలతోనే లిక్కర్ పాలసీలో మార్పులు చేసి ఎంపిక చేసుకున్న కొందరు వ్యక్తులు భారీగా లబ్ది చెందేలా రూపొందించారని ఈడీ వాదించింది. లిక్కర్ పాలసీలో మనీశ్ పాత్ర ప్రత్యక్షంగా ఉన్నట్టు ఆధారం ఉన్నదని తెలిపింది. ఆయనను విచారణకు సహకరించడం లేదని ఆరోపించింది. మనీశ్ సిసోడియాను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది.
ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. మనీశ్ సిసోడియాను ఏడు రోజుల ఈడీ కస్టడీకి పంపించడానికి అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీబీఐ మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో సిసోడియాను ఈడీ నిన్న అరెస్టు చేసింది.
సీబీఐ కేసు నుంచి బెయిల్ కోసం మనీశ్ సిసోడియా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు విచారణకు ఒక్క రోజు ముందు ఈడీ అరెస్టు చేసింది. ఈ రోజు సీబీఐ కేసులో సిసోడియాకు బెయిల్ దరఖాస్తును విచారించారు. ఈ విచారణను కోర్టు మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది.
