ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబేర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, ఆయనపై యూపీలో ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కారణంగా ఆయనకు బెయిల్ లభించినా జైలులోనే ఉండబోతున్నారు. ప్రజాస్వామ్యంలో భిన్న భావాలు వెల్లడించుకోవడం అత్యవసరం అని వివరించారు. 

న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకర్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం సనాతనమైనదని, అసమ్మతిని ఆహ్వానించే మతం అని వివరించింది. అలాగే, ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలు అవసరం అని తెలిపింది.

మహమ్మద్ జుబేర్ 2018లో 1983 సినిమా పిక్‌తో ఓ ట్వీట్ చేశారు. 2014కు ముందు.. 2014 తర్వాత అనే తేడాలతో ఆ ట్వీట్ ఉన్నది. ఈ ట్వీట్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదిదారుడిని పోలీసులు ఇంకా కనుగొనాల్సి ఉన్నది. ట్విట్టర్ అకౌంట్‌లో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు మహమ్మద్ జుబేర్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం మహమ్మద్ జుబేర్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. అనంతరం, ఈ కేసులో మహమ్మద్ జుబేర్‌కు బెయిల్ ఇచ్చింది. కానీ, యూపీలో ఆయనపై ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కారణంగా బెయిల్ లభించినా ఆయన జైలులోనే ఉండనున్నారు.

హిందూయిజం చాలా పురాతనమైనదని కోర్టు తెలిపింది. అసమ్మతిని అంగీకరించే మతం అని వివరించింది. ఈ సందర్భంగా అడిషనల్ సెషన్స్ జడ్జీ దేవేందర్ కుమార్ జంగాలా మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు విమర్శించుకోవచ్చని తెలిపారు. ఒక పార్టీని విమర్శించినంత మాత్రానా దాన్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని శిక్షించలేమని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో భిన్న గొంతుకలు అవసరం అని విరవించారు. ఒక ప్రజాస్వామిక వ్యవస్థకు ఫ్రీ స్పీచ్ అనేది సరైన పునాది అని వివరించారు. 

హిందూ మతం పురాతనమైనదని, అది భిన్న వ్యవహారాలను ఆహ్వానిస్తుందని చెప్పారు. హిందూ మత విశ్వాసకులు తమ సంస్థలు, సంఘాలు, ఇతర వసతులకు దేవుళ్ల పేర్లు కూడా గౌరవంగా పెడతారని తెలిపారు.