టూల్‌కిట్‌ కేసులో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశా రవికి బెయిల్‌ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ఈ మేరకు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో దిశ రవికి బెయిల్‌ ఇచ్చింది.

స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశా రవితో పాటు నికితా జాకబ్‌, శంతను ములుక్‌లకు సంబంధం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో ఫిబ్రవరి 13న బెంగళూరులోని తన నివాసంలోనే దిశా రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరు రోజులు పోలీస్‌ కస్టడీలో, రెండు రోజులు జైలులో ఉన్నారు.   

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న పోరాటానికి మద్దతుగా గ్రేటా థెన్‌బర్గ్‌ షేర్‌ చేసిన టూల్‌కిట్‌ కలకలం రేపింది.

ఈ టూల్‌ కిట్‌ వ్యవహారంలో దిశా రవికి కూడా సంబంధం ఉందంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో తొలుత ఆమెను మూడు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించిన కోర్టు.. పోలీసుల అభ్యర్ధనతో మరో రోజు పొడిగించింది.

అయితే, ఆ గడువు మంగళవారం ముగియనుండటంతో పోలీసులు మరో నాలుగు రోజుల పాటు దిశను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే శనివారం దిశా రవి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన న్యాయస్థానం ఈ రోజు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

టూల్ కిట్ కేసులో ఇప్పటికే ఇంజినీర్‌ నికితా జాకబ్‌, న్యాయవాది శంతను ములుక్‌లకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.