రక్షించాల్సిన పోలీసే భక్షకుడిగా మారాడు. బాధల్లో ఉన్న బాలికకు ధైర్యం చెప్పి... ఆమెకు సహాయం చేయాల్సిందిపోయి...ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కౌన్సిలింగ్ కి తీసుకువెళతానని చెప్పి... బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన 16ఏళ్ల బాలిక మూడు రోజుల కిందట కిడ్నాప్ కి గురైంది. దీంతో... బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు పెట్టారు. కాగా.. మరుసటి రోజు ఇంటికి చేరిన బాలిక...తనపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. దీంతో... బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు.

ఈ కేసు విషయంలో... పోలీసులు ఇరు కుటుంబాల మధ్య సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాగా.. అత్యాచార ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలికకు కౌన్సిలింగ్ అవసరమని చెప్పి... వారి కుటుంబసభ్యులను కానిస్టేబుల్ నమ్మించాడు. కౌన్సిలింగ్ తీసుకువెళతానని చెప్పి... బాలికను ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. బాలిక చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఆ డబ్బుతో తిరిగి ఇంటికి వెళ్లిపోమ్మని సూచించాడు.

ఇంటికి చేరుకున్న బాధిత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సదరు కానిస్టేబుల్ ని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.