Delhi CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఉదయం సివిల్ లైన్స్‌లోని సీఎం నివాసంలో ఆమె జన్‌సున్‌వాయ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Delhi CM Rekha Gupta: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై పబ్లిక్ హియరింగ్ (జన్ సున్‌నాయ్) కార్యక్రమంలో ఒక వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన సివిల్ లైన్స్‌లోని సీఎం రేఖ గుప్తా నివాసంలో జరిగింది. భద్రతా సిబ్బంది వెంటనే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద నుంచి కోర్టుకు సంబంధించిన పత్రాలు దొరికాయని సమాచారం. దాడికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఢిల్లీ సీఎంఓ ప్రకారం, “సీఎంపై ఒక వ్యక్తి దాడి చేశాడు. నిందితుడిని ఢిల్లీ పోలీసులు పట్టుకొని ప్రశ్నిస్తున్నారు” అని ఎక్స్ వేదిక ద్వారా ప్రకటించారు.

ఈ ఘటనలో సీఎం రేఖ గుప్తాకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రజల సమస్యలు వింటున్న సమయంలోనే నిందితుడు ముందుకు వచ్చి చెంపదెబ్బ కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. “ఇది తప్పు. పబ్లిక్ హియరింగ్ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ ఇలా దాడి చేయడం తీవ్రంగా ఖండించదగ్గది” అని ప్రత్యేక సాక్షి పేర్కొన్నారు.

ఈ దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. “ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది, ప్రజలు కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎవరో గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది” అని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ కూడా ఈ దాడిని ఖండించారు. 

Scroll to load tweet…

 “ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంది కానీ హింసకు లేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాం” అని ట్వీట్ చేశారు.