పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం యుద్ద విమానాలతో దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య యుద్దమేఘాలే కమ్ముకున్నారు. ఇలాంటి ఉద్రిక్త సమయంలో కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసనకు దిగడం మంచిది కాదని భావించిన డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇదివరకే  మార్చి1 నుండి నిరవధిక నిరాహార దీక్షకు దిగనునన్నట్లు ప్రకటించిన కేజ్రీవాల్ ఆ దీక్షను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. 

దేశ రాజధాని పేరుతో డిల్లీని కేంద్ర ప్రభుత్వ తమ ఆదీనంలో వుంచుకుని...రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలేవీ లేకుండా చేస్తోందని ఆప్ మొదటినుండి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో డిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ మార్చి1 నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే అందుకు సమయం దగ్గరపడుతున్న సమయంలోనే ఇండో-పాక్ ల మధ్య ఉద్రిక్తత  మరింత పెరిగింది. దీంతో రాజకీయంగా విబేధాలున్నప్పటికి దేశ రక్షణ విషయంలో మేమంతా ఒక్కటే అని తెలియజేయడానికి తన దీక్షను వాయిదా వేస్తున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

అలాగే మరో ట్వీట్ లో కేజ్రీవాల్ భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశంసించారు. టెర్రరిస్ట్ స్థావరాలను నేలమట్టం చేసి ఉగ్రవాదులను హతమార్చిన భారత వైమానిక దళ పైలట్లను ఆయన అభినందించారు. వీరి సాహసోపేత చర్యల వల్ల దేశం యావత్తు గర్విస్తోందని అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఎదిరించడంలో మనం విజయం సాధించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.