బీజేపేత‌ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ రూ.6,300 కోట్లు ఖర్చు చేయకపోతే ఆహార పదార్థాలపై జీఎస్టీ అవసరం ఉండేది కాదని ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సిఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం మరోమారు విరుచుకుపడ్డారు. వివిధ రాష్ట్రాల్లోని బీజేపేత‌ర‌ ప్రభుత్వాలను పడగొట్టడానికి 6,300 కోట్లు ఖర్చు చేయకపోతే ఆహారోత్ప‌త్తులపై జీఎస్టీ అవసరం ఉండేది కాద‌నీ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. పెరుగు, మజ్జిగ, తేనె, గోధుమలు, బియ్యం మొదలైన వాటిపై విధించిన జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఏటా 7500 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వాల‌ను కూల్చేందుకు బీజేపీ రూ 6300 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని దుయ్య‌బట్టారు. బీజేపేత‌ర‌ ప్రభుత్వాలు కూల్చ‌క‌పోయి ఉంటే.. గోధుమలు, బియ్యం, మజ్జిగ తదితరాలపై జీఎస్టీ విధించి ఉండేది కాదనీ, ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఉండేది కాద‌ని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

ముఖ్యంగా.. ఢిల్లీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ.. బీజేపీని ఇత‌ర పార్టీల స‌ర్కార్ల‌ను కూల్చే సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా అభివ‌ర్ణించిన అనంత‌రం ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటి వరకు దేశంలోని అనేక ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసింద‌నీ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, మ‌ధ్య‌ప్ర‌దేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టింద‌ని విమ‌ర్శించారు. సీరియల్ కిల్లర్ లా ఒకదాని తర్వాత మరొక ప్ర‌భుత్వాన్ని పడగొడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో పార్టీని వీడేందుకు 40 మంది ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. బిజెపి 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి, పార్టీ మారడానికి ఒక్కొక్కరికి బీజేపీ 20 కోట్ల రూపాయల ఆఫర్‌ను ఇస్తోందని ఆయన అన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి లాక్కొంద‌ని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఇచ్చినా.. వారి కోసం రూ. 5,500 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోందని ఆరోపించారు. బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం ఇలాంటి దుర్శ్చ‌ర్య‌ల‌ను పాల్ప‌డుతుంది కాబ‌ట్టే.. ద్రవ్యోల్బణం తీవ్ర‌మవుతోంది. సామాన్యుల నుంచి దోచుకుని.. ఎమ్మెల్యేలను కొనుగోలుకు డ‌బ్బు ఖ‌ర్చు చేస్తుందని ఆరోపించారు. 

Scroll to load tweet…