ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కీలక కుట్రదారుడు: కోర్టులో ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక కుట్రదారుడని ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అని కోర్టుకు తెలిపింది. కాబట్టి, సీఎంను పది రోజులు రిమాండ్‌కు పంపాలని విజ్ఞప్తి చేసింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, ఆయన కీలక కుట్రదారుడు అని వాదించారు. సీఎం కేజ్రీవాల్‌ను పది రోజులపాటు రిమాండ్‌కు పంపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేర ప్రక్రియలో, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా భాగస్వామ్యులై ఉన్నారని ఏఎస్‌జీ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. కాబట్టి, ఆయనను పది రోజుల రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు.
లంచాలు తీసుకునేలా ఈ పాలసీని రూపొందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, దక్షిణాది ముఠాకు విజయ్ నాయర్ మధ్య దళారీగా ఉన్నారు. ఈ దక్షిణాది కార్టెల్‌లో ఇప్పటికే అరెస్టయిన కే కవిత కీలక కుట్రదారు. విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సమీపంలోనే ఉంటారు. సీఎం కేజ్రీవాల్‌తో దగ్గరిగా పని చేశారు. లిక్కర్ బేరన్‌లకు అనుకూలంగా పాలసీని తయారు చేసినందుకు తమకు తాయిలాలు అందించాలని డిమాండ్ చేశాడు అని ఈడీ వాదిస్తున్నది.
‘45 కోట్ల రూపాయాలు గోవా ఎన్నికల కోసం వాడుకున్నారు. ఈ లిక్కర్ పాలసీని అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు అమలు చేశారు. విజయ్ నాయర్ కేజ్రీవాల్‌కు రైట్ హ్యాండ్ మనిషి. ఆయన కేజ్రీవాల్ కోసం వసూళ్లు జరిపేవాడు. పాలసీ నిబంధనలను నిరాకరించిన వారిని బెదిరించేవాడు. ఈ నేరం ద్వారా రూ. 100 కోట్ల లంచాలే కాదు.. లంచాలు చెల్లించినవారు అందుకున్న లాభాలను కూడా లెక్కించాలి. మొత్తంగా ఇది రూ. 600 కోట్లు’ అని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు.