గొంతునొప్పి, జ్వరం: సెల్ఫ్ ఐసోలేషన్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లారు. ఆయన రేపు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. తన సమావేశాలను అన్నింటిని ఆయన రద్దు చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. జ్వరం, గొంతు నొప్పితో ఆయన బాధపడుతున్నారు. దాంతో ఆయన ఐసోలేషన్ కు వెళ్లారు. రేపు మంగళవారం ఆయనకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ముందు జాగ్రత్త చర్యగానే ఆయన ఐసోలేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమావేశాలను అన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నారు. ఢిల్లీ కరోనా వైరస్ వ్యాధితో అట్టుడుకుతోంది. మొత్తంగా భారతదేశంలోనే కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ఒక్క రోజులోనే గత 24 గంటల్లో 9,983 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,24,095 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 1,25,381 యాక్టవ్ కేసులు ఉన్నాయి.
దేశంలో మరణాల సంఖ్య 7,135కు చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర చైనాను దాటిపోయింది. మహారాష్ట్రలో 85975 కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో ఆదివారంనాడు 1,300కు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,64కు చేరుకుంది. కరోనా వైరస్ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది.