పోలీసులు తనను గృహ నిర్బంధం చేయడంపై స్పందించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. తాను సీఎం హోదాలో కాకుండా ఓ సాధారణ వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులు తన ప్లాన్ తెలిసుకుని బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ సరిహద్దులో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే చాలా సమయం తర్వాత ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.

సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది.

ఈ మేరకు ఆప్‌ లీడర్‌ సౌరవ్‌ భరద్వాజ్‌ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆప్ శ్రేణులు బైఠాయించాయి. 

అయితే ఆప్ వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పడం అవాస్తమని అన్నారు. తాము ఆప్, ఇతర పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ట్విటర్‌లో కేజ్రీవాల్ నివాసం వద్ద ఎలా ఉందో చూడండి అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పోలీసులకు, ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. దయచేసి ఆధారాలను తారుమారు చేయవద్దని కోరింది.