దేశంలో కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈచట్టం అమలులోకి వచ్చిన తర్వాత చాలా మందికి వేలల్లో  జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. జరిమానాల వార్తలతోపాటు... ఈచట్టం గురించి కొత్త పుకార్లు కూడా పుట్టుకువస్తున్నాయి. బైక్ పై ప్రయాణించే వ్యక్తికి హెల్మెట్, కారులో ప్రయాణించే వ్యక్తి సీటు బెల్టు ఎలా తప్పనిసరో... క్యాబ్ లో ప్రయాణించే వ్యక్తి వద్ద కండోమ్ తప్పని సరి అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కండోమ్ లేని కారణంగా ఓ క్యాబ్ డ్రైవర్ కి ఢిల్లీ పోలీసులు జరిమానా కూడా విధించినట్లు సమాచారం.

దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆ క్యాబ్ డ్రైవర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. దీంతో వైరల్ అయ్యింది. ఆ క్యాబ్ డ్రైవర్ మీడియాతో మాట్లాడుతూ... ‘ ట్రాఫిక్ సిబ్బంది నా క్యాబ్ ని చెక్ చేసినప్పుడు నా ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కండోమ్ లేదని జరిమానా విధించారు. ఇలా ఇంకొకరికి జరగకూడదని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నా’ అంటూ అతను పేర్కొన్నాడు.

ఈ విషయంపై మరో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ... ఫిట్ నెస్ టెస్టులో భాగంగా చాలా సార్లు ట్రాఫిక్ అధికారులు క్యాబ్ లో కండోమ్ ఉందా అని ప్రశ్నించేవారని చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ క్యాబ్ లో ఒక కండోమ్ ఉంచుతానని చెప్పాడు. ఇంకో డ్రైవర్... ప్రమాదాలు జరిగితే కట్టుకోవడానికి ఉపయోగపడుతుందని కండోమ్ ని ఎప్పుడూ క్యాబ్ లో ఉంచుతానని చెప్పడం విశేషం.

కాగా.. ఈ వార్తలపై ఢిల్లీ ట్రాఫిక్  పోలీసులు స్పందించారు. కొత్త వాహనచట్టంలో క్యాబ్ లో కండోమ్ ఉండాలనే నియమం ఏమీ లేదని తేల్చిచెప్పారు. అలా ఎవరైనా ఫైన్ వేస్తే.. ఉన్నతాధికారులను సంప్రదించవచ్చని చెప్పారు.  ఫిట్ నెస్ టెస్టులో కూడా తాము కండోమ్ ప్రస్తావన తీసుకురామని చెప్పారు.