ఓ వ్యక్తి పీకలదాకా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చే మార్గం కనపడట్లేదు. చనిపోదామంటే ధైర్యం చాలడం లేదు. దీంతో.. తనను చంపడానికి తానే సుపారీ ఇచ్చుకున్నాడు. తన మరణానంతరం భీమా సొమ్ము వస్తుంది కదా అని.. దానితో తన కుటుంబం హ్యాపీ గా బతుకుతుందని ఆశపడి అతను అలా చేయడం గమనార్హం. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని ఐపీ ఎక్స్ టెన్షన్ కు చెందిన కిరాణా దుకాణం యజమాని గౌరవ్(37) కనిపించడం లేదని ఆయన భార్య షానూ భన్సాల్ ఈ నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుకాణానికి వెళ్లిన తన భర్త తిరిగి ఆమె ఇంటికి రాలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఆయన శవం కనిపించింది.

ఆయనను ఎవరు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ నేరస్తుల ముఠాకు అతనే డబ్బు ఇచ్చి మరీ తనను హత్య చేయమని పురమాయించాడని తేలింది. కాగా.. గౌరవ్ తన హత్యకు సుపారీ ఇచ్చింది..ఓ మైనర్ బాలుడికి కావడం గమనార్హం.

అతను సుపారీ ఇచ్చిన ప్రకారం.. గౌరవ్ ని వాళ్లు చంపేశారు. కాగా.. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.