దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. సీఎం కేజ్రీవాల్ కూడా ఇటీవల నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేయడానికి దాదాపు ఆరు గంటల పాటు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం గమనార్హం. ఆయన కన్నా ముందు 50మంది నామినేషన్ వేయడానికి నిలపడటంతో ఆయన అంతసేపు ఎదురుచూడాల్సి వచ్చింది.

ఈ సంగతి పక్కన పెడితే... గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ప్రస్తుతం  కేజ్రీవాల్ ఆస్తులు పెరిగాయి. నామినేషన్ తోపాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు పొందుపరుస్తారన్న విషయం తెలిసిందే. కాగా... నిన్న నామినేషన్ వేసే సమయంలో  అఫిడవిట్ లో కేజ్రీవాల్ తన ఆస్తుల విలువ రూ.3.4కోట్లుగా పొందుపరచడం గమనార్హం.

2015 ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ రూ.2.1 కోట్లుగా పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం రూ.3.4కోట్లుగా చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఆస్తుల విలువ రూ.1.3 కోట్లు పెరగడం గమనార్హం. 

Also Read కేజ్రీవాల్ కు లగే రహో చిక్కులు: రూ. 500 కోట్లకు దావా.

ఆయన భార్య సునీత కేజ్రీవాల్ పేరిట 2015లొ 15లక్షలు క్యాష్  ఫిక్స్డ్ డిపాజిట్ గా  ఉన్నట్లుగా పేర్కొన్న ఆయన.. నిన్నటి అఫిడవిట్ లో 57లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పటితో పోలిస్తే రూ.32లక్షలు పెరిగాయి.  సునీతా కేజ్రీవాల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం, ఇతర సేవింగ్స్ కారణంగా ఆ డబ్బు పెరిగినట్లు ఆయన చెప్పారు.

ఇక కేజ్రీవాల్ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ గతంలో రూ.2.2లక్షలు ఉండగా ప్రస్తుతం అది రూ.9.6లక్షలకు చేరింది. ఇక ఆయన స్థిర ఆస్తులు రూ.92లక్షల నుంచి రూ.1.7కోట్లకు పెరిగింది. ఆయన భార్య పేరిట ఉన్న స్థిర ఆస్తుల విలువ మాత్రం అప్పుడు ఇప్పుడు యథావిధిగా ఉంది. స్థిర ఆస్తుల భూమి మార్కెట్ రేట్ పెరగడం వల్లే ఆస్తుల విలువ పెరిగిందని ఆప్ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.