Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి రీఎంట్రీ ఇచ్చిన కాలుష్యం.. జనానికి ముక్కుల్లో, గొంతులో మొదలైన మంట

దేశరాజధాని ఢిల్లీని మరోసారి కాలుష్య భూతం పలకరించింది. ప్రతి ఏటా చలికాలంలో దట్టంగా కమ్మేసే పొగమంచు మరోసారి నగరాన్ని చుట్టుముట్టింది. ఇప్పటికే వాయు సూచీ అధ్వాన్న స్థాయికి చేరుకుంది.

delhi air pollution:emergency action plan starts
Author
Delhi, First Published Oct 15, 2018, 10:42 AM IST

దేశరాజధాని ఢిల్లీని మరోసారి కాలుష్య భూతం పలకరించింది. ప్రతి ఏటా చలికాలంలో దట్టంగా కమ్మేసే పొగమంచు మరోసారి నగరాన్ని చుట్టుముట్టింది. ఇప్పటికే వాయు సూచీ అధ్వాన్న స్థాయికి చేరుకుంది. దీంతో సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోయ్యాయి. నిన్న ఉదయం 10 గంటల సమయంలో గాలి నాణ్యత 201గా నమోదైందని కాలుష్య నియంత్రణా సంస్థ ప్రకటించింది. ప్రతి ఏటా ఢిల్లీకి సమీపంలోని పంజాబ్, హర్యానా రైతులు.. పొలాల్లో పంట వచ్చిన తర్వాత.. చెత్తను తగులబెడతారు.

లక్షలాది హెక్టార్లలో ఈ విధంగా చేయడం వల్ల పొగ కాలుష్య మేఘాలుగా మారి రాజధాని వైపుగా వస్తుంది. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తీసిన చిత్రాల్లో వరి గడ్డిని తగులబెడుతున్న దృశ్యాలు కనిపించాయి. గతంలో ఎదుర్కొన్న పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు.

కేంద్రప్రభుత్వంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన ఆయన... అధికారులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశించారు. నగర ప్రజలు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని.. గాలి నాణ్యతను పెంచేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశామని, డీజిల్ జనరేటర్లను ఆపివేయడం, మెట్రో రైలు సర్వీసులను పెంచడం వంటి చర్యలను చేపడుతున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

మరోవైపు ప్రజలపై అప్పుడే కాలుష్య ప్రభావం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో పాటు ముక్కు, గొంతుల్లో మంట మొదలైనట్లుగా తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios