ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన మందిరాలు ఉన్నాయని, ఆ కాంప్లెక్స్‌లో దైవ విగ్రహాలు ఉన్నాయని ఢిల్లీలోని సాకెత్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ దైవ విగ్రహాలను కొలిచేందుకు అనుమతించాలని, భక్తుల పూజించే హక్కును కాపాడాలని ఆ పిటిషన్ పేర్కొంది. ఆ కాంప్లెక్స్‌లో 800 ఏళ్లుగా పూజలు అందుకోని ఆ విగ్రహాలను.. ఇక పైనా అలాగే కొనసాగనివ్వండని న్యాయమూర్తి అన్నారు.
న్యూఢిల్లీ: కుతుబ్ మినార్‌లో హిందూ దైవ విగ్రహాలు ఉన్నాయని, వాటిని పూజించడానికి అనుమతించాలని సాకెత్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో వందల ఏళ్ల క్రితం నాటి హిందూ, జైన మందిరాలు ఉన్నాయని ఆ పిటిషన్ పేర్కొంది. వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. ఆ కాంప్లెక్స్‌లోని దైవ విగ్రహాలను ఆరాధించడానికి అనుమతించాలని తెలిపింది ఈ పిటిషన్‌పై సాకెత్ కోర్టు జడ్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో 800 ఏళ్లుగా ఆ దైవ విగ్రహం పూజలు అందుకోకుండానే ఉండి ఉంటే.. ఆ విగ్రహాన్ని అలాగే ఉండనివ్వాలని న్యాయమూర్తి అన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది అడ్వకేట్ హరిశంకర్ జైన్ వాదించారు. ఒక వేళ దైవ విగ్రహాన్ని ధ్వంసం చేసినా.. ఆ విగ్రహ పవిత్రత కోల్పోదని అన్నారు. ఆ కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో దైవ విగ్రహాలు ఉన్నాయని వాదించారు. ఒక వేళ దేవుడి విగ్రహాలు మనుగడ సాధిస్తే.. వాటికి పూజించే భక్తుల హక్కులు కూడా ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన ఉటంకించారు.
భక్తులకు పూజించే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంటుందని, ఆ హక్కు ఇప్పుడు తిరస్కరణకు గురి అవుతున్నదని న్యాయవాది వాదించారు. ఈ వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ.. సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటే.. పూజించే హక్కును నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
కాగా, ఈ పిటిషన్ విచారణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సమాధానాన్ని వినిపించింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ ఆలయాలను పునరుద్ధరించాలనే నిర్ణయాన్ని ఏఎస్ఐ వ్యతిరేకించింది. ఎందుకంటే.. కుతుబ్ మినార్ 1914 నుంచి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని స్పష్టం చేసింది. అంతేకాదు, అంతకుముందు ఆలయాలను ధ్వంసం చేసి కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లోని మసీదు నిర్మించారని చెప్పడానికి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపడంపై వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తవ్వకాలు జరపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాలని ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేయలేదని వివరించారు.
వారణాసిలోని జ్ఞానవాపసి వివాదం తరహాలోనే కుతుబ్ మినార్‌ను కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదని, రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడని ఏఎస్ఐ మాజీ రీజనల్ డైరెక్టర్ దరమ్ వీర్ శర్మ పేర్కొన్నారు. అంతేకాదు, అ కాంప్లెక్స్‌లో హిందూ దేవుళ్ల విగ్రహాలు సైతం బయటపడ్డాయనే వాదనలు కొందరు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతి శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ మే 21న కుతుబ్ మినార్ కాంప్లెక్స్ సందర్శించారు. ఆయన ముగ్గురు చరిత్రకారులు, నలుగురు ఏఎస్ఐ అధికారులు, పరిశోధకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగానే ఆయన కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో తవ్వకాలు జరపాలని ఏఎస్ఐ అధికారులను ఆదేశించినట్టు కథనాలు వచ్చాయి.
తాజాగా, ఆ కథనాల్లో వాస్తవం లేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
