కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ప్రస్తుతం భారత్ లోనూ విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. దేశంలో కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు లాక్ డౌన్ విధించారు. అయినా. కేసులు మరింత పెరగడంతో.. లాక్ డౌన్ ని వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు.

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే.. ఎంత చేస్తున్నా.. కొందరు మాత్రం ప్రభుత్వ కృషిని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. లాక్ డౌన్ ని అతిక్రమించి విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

తాజాగా కర్ణాటకలోని కులబురగి ఆలయానికి గురువారం భక్తుల వందల సంఖ్యలో తరలి వచ్చారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా.. కరోనా భయం కొంచెం కూడా లేకుండా భక్తులు తరలివెళ్లడం గమనార్హం.

కాగా.. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 20మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆలయ మేనేజ్మెంట్ సహా 20మందిపై ఐపీసీ సెక్షన్ 188,143, 269 కింద కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు.

కాగా.. దాదాపు 100 నుంచి 150మంది వరకు ఆలయంలో పూజలకు హాజరైనట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు రాకండి రా బాబు అని మొత్తుకుంటున్నా కూడా.. వారు ఇలా పూజల పేరిట బయటకు రావడం గమనార్హం.